లొంగిపోయిన మావోయిస్టు

లొంగిపోయిన మావోయిస్టు
  • మీడియాకు తెలిపిన ములుగు పోలీసులు

ములుగు, వెలుగు : మావోయిస్టు పామిడి ఏరియా కమిటీ సభ్యుడు, జనతన సర్కార్ జారపల్లి రీజినల్ పీపుల్స్ పార్టీ కమిటీ అధ్యక్షుడు తాటి భామన్ లొంగిపోయాడు. ఆదివారం ములుగు డీఎస్సీ, ఇన్ చార్జ్ ఓఎస్డీ ఎన్.రవీందర్ వివరాలు తెలిపారు.  చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పీఎస్ పరిధి సేండ్రంబోర్ గ్రామానికి చెందిన తాటి భామన్ జనతన సర్కార్ జారపల్లి రీజినల్ పీపుల్స్ కమిటీ అధ్యక్షుడిగా దక్షిణ బస్తర్ డివిజన్ లో పని చేస్తున్నాడు. 

ఇతనికి భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. 2004లో పామేడ్ దళ కమాండర్ ముఖేశ్​ప్రోద్బలంతో మిలీషియా సభ్యుడిగా పార్టీలో చేరిన భామన్ 2010లో జారపల్లికి చెందిన జనతన సర్కార్ కి బదిలీ కాగా 2019 వరకు సభ్యుడిగా పనిచేశాడు. జనతన సర్కార్ అధ్యక్షుడు సోడి దేవా అరెస్ట్ తర్వాత భామన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. 2006లో తొగ్గుడెం సమీపంలో మావోయిస్టుల దాడిలో 12మంది పోలీసులు మరణించిన ఘటనలో నిందితుడిగా ఉన్నారు.

2013లో  సేండ్రంబోర్ వద్ద ఎదురుకాల్పుల ఘటన, 2019లో యంపూర్ వద్ద ఎదురుకాల్పులు, 2024లో పామేడ్ పరిధి ధర్మారం పోలీసు క్యాంప్ దాడిలో భామన్ పాల్గొన్నాడు. మావోయిస్టులు ఆదివాసులపై దాడులు, హత్యాకాండ, అణిచివేత కారణంగా తెలంగాణ సర్కార్ ప్రకటించిన పునరావాస పథకాలకు ఆకర్షితుడైన భామన్ లొంగిపోయినట్లు ఇన్ చార్జ్ ఓఎస్డీ రవీందర్ తెలిపారు. లొంగిపో యిన మావోయిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తుందని,  మావోయిస్టులకు నగదు పారితోషికంతో పాటు, ఉపాధి మార్గం చూపుతుందని ఓఎస్డీ పేర్కొన్నారు.