
వరంగల్, వెలుగు : ‘కడియం శ్రీహరి నన్ను ప్రజల్లో పల్చన చేసిండు.. మానసిక క్షోభకు గురిచేసిండు.. కష్టాల్లోకి నెట్టిండు.. నేను ఏ పార్టీలోకి పోతే అందులోకి వచ్చి ఇబ్బంది పెట్టిండు.. కేసీఆర్ నాకు డిప్యూటీ సీఎం పదవిస్తే.. కడియం కుట్రతో గుంజుకున్నడు’ అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
లంచాలు తీసుకోవడంలో కడియం ముందుంటాడని, ఆ తర్వాత సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. చెప్పలేని స్థాయిలో తనను ఇబ్బంది పెట్టాడని, ఆయన తీరుతో తాను నిండా మునిగానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, శ్రీహరిని రాజకీయంగా సమాధి చేస్తానని సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో లీడర్లు సుందర్ రాజ్‌యాదవ్, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.