![పన్ను వసూళ్ల టెన్షన్ .. ఖమ్మం జిల్లాలో టార్గెట్ కు దూరంగా మున్సిపాలిటీలు](https://static.v6velugu.com/uploads/2025/02/tax-collection-has-become-tension-for-municipalities-in-joint-khammam-district_5ZgdDQC3xM.jpg)
- ఇప్పటి వరకు వసూళ్లలో సత్తుపల్లి టాప్, వైరా లాస్ట్
- సర్వే, ఇతర ప్రభుత్వ పనుల్లో సిబ్బంది బిజీ
- స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్న ఆఫీసర్లు
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఇంటి, నల్లా ట్యాక్స్ వసూళ్లపై సర్వే, ఇతర ప్రభుత్వ పథకాల దెబ్బపడింది. దీంతో ట్యాక్స్ వసూళ్ల లక్ష్యం పూర్తి కాక, మున్సిపాలిటీల్లో పనిచేసే సిబ్బందికి ప్రతినెలా జీతం ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా సెంట్రల్గవర్నమెంట్ఆఫీస్లకు సంబంధించి ట్యాక్స్ బకాయిలు మున్సిపాలిటీలకు గుదిబండగా మారాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు నెలన్నర గడువు మాత్రమే ఉండడంతో అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను, నల్లా పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఆటోలు, మైకులు, పాంప్లేట్స్ తోపాటు డివిజన్లు, వార్డుల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ లు ఇంటింటికీ తిరుగుతూ పన్ను చెల్లించాలని ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో టెక్నాలజీని కూడా వాడుతున్నారు. ప్రాపర్టీ ఓనర్సెల్ ఫోన్లకు మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వ వెబ్ సైట్ లింక్ ను పంపుతున్నారు. ఆ లింక్ ద్వారా వెంటనే ట్యాక్స్ చెల్లించే వీలుంటుంది. ఆయా డివిజన్లలోని కూడళ్లలో ట్యాక్స్ కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎక్కడెక్కడ.. ఎంత వసూళ్లు..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలున్నాయి. అశ్వారావుపేట, ఏదులాపురం మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో మాత్రమే 50 శాతానికి పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. పాల్వంచలో 44 శాతం మేర వసూళ్లు జరగ్గా, అత్యంత తక్కువగా వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి చాలా దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.
మరోవైపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర కేంద్ర సంస్థలు ఎక్కువగా ఉండడంతో వాటి పన్ను, నీటి పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్ ఉన్నాయి. కొత్తగూడెంలో నల్లాలకు సంబంధించి రూ. 6 కోట్లు బకాయిలున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ. 50 లక్షలు మాత్రమే వసూళ్లయ్యాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఎస్ఎన్ఎల్, రైల్వే శాఖల నుంచి 1.50 కోట్లు రావాల్సి ఉంది. మణుగూరు మున్సిపాలిటీలోనూ ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి రూ.18 లక్షలకు పైగా బకాయి ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ లో నల్లా పన్ను టార్గెట్ రూ.14.20 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
పన్నుల వసూళ్లపై సర్వే దెబ్బ..
మున్సిపాలిటీల్లో సాధారణంగా ట్యాక్స్ వసూళ్లకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పన్ను వసూలు జరుగుతుంది. కాగా డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువగా ప్రభుత్వ ప్రోగ్రామ్స్, సర్వేలు ఉండడంతో సిబ్బంది ఆ పనుల్లో ఉండడంతో ఇంటి, నల్లా పన్నును వసూళ్లు చేసే వారు కరువయ్యారు. మరోవైపు పట్టణాల్లో బడాబాబుల దగ్గర నుంచి బకాయిలు వసూళ్లు చేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొత్తగూడెం పట్టణంలోని ఎంజీ రోడ్లో గల ఇద్దరు ప్రముఖ వస్త్ర దుకాణాల యాజమానులు రూ.5లక్షలకు పైగా బకాయి ఉన్నా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
ట్యాక్స్ వసూళ్లు సరిగా లేకపోవడం, ఇంటి, నల్లా పన్ను భారీగా పేరుకుపోవడంతో కొన్ని మున్సిపాలిటీల ఖజానాలో డబ్బులు లేక పారిశుధ్య సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రతినెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బందికి రెండు నెలల జీతాలు బకాయిలున్నాయి. అయితే ఏడాది మొత్తం పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేసే అధికారులు, చివరి మూడు నెలల్లో హడావుడి చేస్తుంటారని, దీని వల్లనే బకాయిలు పేరుకుపోతున్నాయన్న విమర్శలున్నాయి.