SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్‌లో SRH మేనేజ్మెంట్ మెలిక

SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్‌లో SRH మేనేజ్మెంట్ మెలిక

ఉప్పల్ వేదికగా శుక్రవారం(మే 16) జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో అంపైర్లు.. ఇరు జట్లకు చెరొక్క పాయింట్ కేటాయించారు. దీంతో 15 పాయింట్లకు చేరుకున్న ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా.. 12 పాయింట్లతో గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తెలుగు అభిమానులకు ఇది ఆనందాన్ని పంచేదే అయినా.. సన్ రైజర్స్ యాజమాన్యం ప్రకటించిన ఒక నిర్ణయం అయోమయంలో పడేసింది.

వర్షం కారణంగా హైదరాబాద్-గుజరాత్ మ్యాచ్ రద్దయ్యింది కనుక టికెట్ డబ్బులు వెనక్కి చెల్లిస్తామని సన్ రైజర్స్ యజమానన్యం ప్రకటించింది. ఆన్ లైన్‌లో టికెట్లు కొన్నవారందరికి రిఫండ్ ప్రాసెస్ ఎలా అనేది ఈమెయిల్ ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపింది. డబ్బును పేటీఎమ్ ద్వారా రిఫండ్ చేస్తామని వెల్లడించింది. ఇది బాగానే ఉన్నా.. చెల్లించాల్సిన డబ్బు మొత్తంపై మేనేజ్మెంట్ ఒక షరతు పెట్టింది. GST, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయించి మిగతా డబ్బులు రిఫండ్ చేస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంపైనే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంటర్టైన్మెంట్ లేనిది ట్యాక్స్ ఎందుకు..?

వర్షం కారణంగా కనీసం టాస్ కూడా వేయలేదు. ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూములకే పరిమితమవ్వగా.. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లిన ప్రేక్షకులు వర్షంలో తడిసి ముద్ధయ్యారు. పైగా మ్యాచ్ జరుగుతుందేమో అన్న ఆశతో గంటల పాటు నిరీక్షించారు. ఇవేవీ పట్టించుకోని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం.. ట్యాక్స్‌లు కట్ చేయడమేంటని టికెట్లు కొన్న వారు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎంటర్టైన్మెంట్ లేనిది ట్యాక్స్ ఎందుకు..? చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై యాజమాన్యం వివరణ ఇవ్వాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే, స్టేడియంలో నిరాశతో కూర్చున్న అభిమానుల కోసం నిర్వాహకులు కాసేపు లైటింగ్ ఎఫెక్టులతో ఎంటర్టైన్ చేశారు. బహుశా..! అందుకు కట్ చేశారేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.