
Pan-Aadhar Update: కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ టాక్స్ శాఖ కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డు పొందిన పాన్ కార్డ్ హోల్డర్లు మారిన రూల్స్ ప్రకారం డిసెంబర్ 31, 2025 నాటికి తమ ఆధార్ కార్డు నంబర్లను అప్‌డేట్ చేయాలని పన్ను శాఖ స్పష్టం చేసింది.
వాస్తవానికి 2025 బడ్జెట్లో ప్రవేశపెట్టిన మార్పులకు అనుగుణంగా ఇకపై పాన్ కార్డ్ హోల్డర్లు ఎవరైతే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ పొందారో వారు తాజా మార్పులకు అనుగుణంగా వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి అక్టోబర్ 1, 2024 నుండి ఆధార్ నంబర్‌ల స్థానంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీలను ఉపయోగించడానికి అనుమతించే నిబంధనను నిలిపివేయటంతో ప్రస్తుత మార్పులు వచ్చాయి. పన్ను చట్టంలోని సెక్షన్ 139AA(2A) కింద తాజా నియమాలు వచ్చాయి.
Also Read:-25 ఏళ్లలో బంగారం Vs స్టాక్ మార్కెట్స్..
ఒకవేళ సరైన ఆధార్ నంబర్‌తో పాన్‌ను నవీకరించడంలో విఫలమైతే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు లేదా పాన్‌తో లింక్ చేయబడిన అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలను నిర్వహించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అందుకే గడువు చివరి తేదీ వరకు వేచి చూడకుండా పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్ కార్డు చెల్లుబాటును నిర్థారించుకోవటానికి మారిన నిబంధనలకు అనుగుణంగా ఆధార్ నంబర్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
అసలు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ అంటే ఏంటి..?
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ అనేది ప్రతి ఆధార్ దరఖాస్తుదారునికి కేటాయించబడే 28 -అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది నమోదు సమయంలో అందించే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌లో ఉంటుంది. దీనిని ప్రజలు తమ ఆధార్ కార్డు దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి, ఆధార్ సంఖ్యలను తిరిగి పొందడానికి, గుర్తింపును ధృవీకరించడానికి ఉపయోగిస్తుంటారు.
అయితే ఈ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డులు పొందిన వ్యక్తులకు ప్రస్తుతం ఆధార్ కార్డు ఇష్యూ చేయబడి ఉంటుంది కాబట్టి వారు తమ ఆధార్ నంబర్ అందించాలని పన్ను అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే దేశంలో పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డులకు దానిని జోడించాలనే నిబంధన అమలులో ఉన్న సంగతి తెలిసిందే.