అగర్తలా: 1990 నాటి కాశ్మీరీ పండిట్ల బతుకును తెలియజెప్పేలా తీసిన ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు త్రిపుర ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. జనాలు ఈ సినిమాను చూసేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రజలందరూ తప్పకుండా చూడాలని త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ కోరారు. మరోవైపు కాశ్మీర్ఫైల్స్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తామని గోవా ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక పన్ను మినహాయింపు ప్రకటించాయి. కాగా, ఈ సినిమా చూసేందుకు పోలీసులు సెలవు పెట్టుకునే అవకాశం ఇస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఎమ్మెల్యేల కోసం స్పెషల్ షో
కాశ్మీరీ ఫైల్స్ చిత్రాన్ని ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక షో వేయనున్నట్టు కర్నాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కగేరి సోమవారం వెల్లడించారు. కాగా, వారం పాటు రోజుకు ఒక షోకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని, జనం ఉచితంగా ఈ సినిమాను చూడాలని విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ప్రకటించారు.