11 లక్షల వరకు రికవరీ.. ఇద్దరికి రిమాండ్​

11 లక్షల వరకు రికవరీ.. ఇద్దరికి రిమాండ్​
  • రూ.48 లక్షల వరకు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు​
  • 11 లక్షల వరకు రికవరీ.. ఇద్దరికి రిమాండ్​
  • మరికొందరిపై కూడా అనుమానాలు

మహబూబ్​నగర్​, వెలుగు : ప్రజల నుంచి వసూలు చేసిన ఇల్లు, నల్లా టాక్స్ బిల్లులను మహబూబ్​నగర్ ​మున్సిపాలిటీలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పక్కదారి పట్టించారు.  ఆ డబ్బును క్యాష్ కౌంటర్లో కట్టకుండా సొంతానికి వాడుకున్నారు. ఓ లేడీ ఎంప్లాయ్ అకౌంట్లు చెక్​ చేస్తుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాలుగు రోజుల కింద రూ. 11 లక్షలు రికవరీ చేసి ఇద్దరిని రిమాండ్  ‌‌ ‌‌కు తరలించారు.  మున్సిపల్ షాపులకు సంబంధించి అద్దె వసూళ్లలోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

హౌస్, నల్లా ట్యాక్సులు పక్కాదారి

మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ 49 వార్డులు  56 వేల ఇండ్లు ఉన్నాయి. హౌస్, వాటర్​, కమర్షియల్​ ట్యాక్సులకు కలిపి ఏటా రూ.18 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో హౌస్​, వాటర్​ ట్యాక్సుల చెల్లింపులకు సంబంధించి రెండు కౌంటర్లు ఉండగా.. 2017 నుంచి ఆఫీస్  ‌‌ ‌‌లో కంప్యూటర్​ ఆపరేటర్ ‌‌గా పని చేస్తున్న ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయ్​ హాజీకి హౌస్, రెగ్యులర్​ఎంప్లాయ్​ ఖాజా నల్లా బిల్లులు వసూలు చేసే బాధ్యత అప్పగించారు.  ఈ రెండు కౌంటర్లలో ప్రతిరోజూ పదిమంది వరకు వచ్చి ట్యాక్స్ పే చేస్తుండగా.. వారికి రసీదులు కూడా ఇస్తున్నారు.  కానీ, ఇందులో కొన్ని బిల్లులను మాత్రమే మున్సిపల్​మేనేజర్ అప్రూవల్​తీసుకొని క్యాష్​ కౌంటర్ ‌‌లో జమ చేస్తున్నారు. మిగతా బిల్లులకు సంబంధించిన  డబ్బులు సొంతానికి వాడుకుంటున్నారు.  ఇలా.. 2017 నుంచి ఇప్పటి వరకు రూ.48 లక్షల వరకు ఫ్రాడ్ చేశారు.

అకౌంటెంట్​ లెక్కలు తీయడంతో బయట పడ్డ అవినీతి

హౌస్​, నల్లా బిల్లులు మొత్తం ఆన్​లైన్​ ద్వారా కడుతున్నారు. ఆన్​లైన్​లోనే ఎన్ని ఇండ్ల బిల్లులకు పన్నులు కట్టారు? ఎన్ని ఇండ్ల ట్యాక్స్​లు పెండింగ్ ‌‌లో ఉన్నాయి? ఇప్పటి వరకు వసూలు చేసినదెంత?  అనే వివరాలు ఉంటాయి.  వీటిని ఆరు నెలలకోసారి మున్సిపాలిటీలో అకౌంట్​సెక్షన్​ఆఫీసర్లు చెక్​చేస్తుంటారు.  ఇందులోభాగంగానే  ట్యాక్సుల ద్వారా వస్తున్న కలెక్షన్​కు, అకౌంట్లో జమ చేస్తున్న డబ్బుకు పొంతన లేకపోవడం గుర్తించారు. వెంటనే  ఇన్​చార్జి కమిషనర్గా ఉన్న సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన  పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు ఫైల్​ చేసి, హాజీ, ఖాజాల నుంచి రూ.11 లక్షలు రికవరీ చేశారు. నాలుగు రోజుల కిందట వీరిద్దరిని అరెస్టు చేసి, రిమాండ్  ‌‌ ‌‌కు తరలించారు.

ఔట్​ సోర్సింగ్ ఎంప్లాయ్‌కి బాధ్యత ఇచ్చిందెవరు? 

మున్సిపాలిటీలో ట్యాక్స్​వసూళ్ల బాధ్యత రెగ్యులర్ ఉద్యోగులే చేయాలని రూల్ ఉంది.  కానీ,  2017 నుంచి ఒక కౌంటర్ లో ఔట్​సోర్సింగ్ ఎంప్లాయ్ లను అప్పట్లో ఉన్న ఓ అధికారి నియమించారు.  కొత్త అధికారులు వచ్చినా, ఇతర సెక్షన్స్ ‌‌లోని ఉద్యోగులు అటుఇటు మారినా.. ఔట్​ సోర్సింగ్​ఎంప్లాయ్ ‌‌ను మాత్రం అక్కడే కొనసాగుతూ వస్తున్నాడు.  కొందరు అధికారుల కావాలనే అతన్ని కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తోంది. 

మున్సిపల్ ​షాపుల అద్దెలు కూడా స్వాహా?

జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా, న్యూటౌన్​, క్లాక్​టవర్​తో పాటు మిగతా ఏరియాల్లో మున్సిపాలిటీకి దాదాపు 200 ఐడీఎస్​ఎంటీ షాపులు ఉన్నాయి. వీటి అద్దెల్లో కూడా  ఫ్రాడ్​ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం వీటి అద్దెలకు సంబంధించి ఒక్కో షాపు నుంచి రూ.లక్షల్లో బకాయిలు ఉన్నాయి. ఇదివరకు మున్సిపాలిటీలో పని చేసి రిటైర్డ్​ అయిన ఓ ఎంప్లాయ్​ అద్దెల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన దుకాణాదారులకు రశీదులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేసి  సొంతానికి వాడుకున్నారని సమాచారం. ఈ విషయం మున్సిపల్​ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. 

మున్సిపాలిటీలో ఫ్రాడ్​ జరుగుతోంది

ట్యాక్స్​ వసూళ్లతో పాటు మున్సిపాలిటీలో దుకాణాల అద్దెల విషయంలో కూడా ఫ్రాడ్​ జరిగింది. దీనిపై విచారణ చేసి బయటపెట్టాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ట్యాక్స్​ వసూలు చేసే బాధ్యతను ఔట్​ సోర్సింగ్​ఎంప్లాయ్​కి ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలి. 

- అంజయ్య, మున్సిపల్​ కౌన్సిలర్​, 
మహబూబ్​నగర్​

రూ.25 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది

ఫ్రాడ్​ జరిగింది వాస్తవమే.  దీనిపై పోలీసులకు కంప్లైంట్​చేయగా.. ఇద్దరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు కొంత అమౌంట్​ను రికవరీ చేశాం. ఇంకా రూ.25 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది.  ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయ్​ను పన్ను వసూలు చేయాలని నేను చెప్పలేదు. నాలుగైదేళ్ల నుంచి ఆయన ఆ సీట్లో ఉన్నాడు.   షాపులకు సంబంధించి కిరాయిలో చెల్లించని వారికి నోటీసులు ఇస్తున్నం. 

- ప్రదీప్​కుమార్​, మున్సిపల్​ కమిషనర్​, మహబూబ్​నగర్​