హైదరాబాద్‍లో లంచం తీసుకుంటూ పట్టుబడిన టాక్స్ ఆఫీసర్

హైదరాబాద్ : నాంపల్లిలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ వ్యాపారి వద్ద నుండి 35 వేలు లంచం తీసుకుంటున్న ఓ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ సిటీ రేంజ్ 1 డిఎస్పీ కె శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అబిడ్స్ లోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో స్టేట్ టాక్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఇందిరా వసంత రెండు రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జిఎస్టీ పెండింగ్ లో ఉందంటూ నోటీసులు జారీ చేసింది. 

సదరు వ్యాపారి ఆ నోటిసులకు వివరణ ఇచ్చేందుకు, జిఎస్టీకు సంబందించిన డాక్యుమెంట్లు తీసుకొని అధికారిణిను కలిశారు. జిఎస్టీ చెల్లింపుతో పాటు, భవిష్యత్ లో అతని వ్యాపారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే... రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాను అంత ఇచ్చుకోలేనని వ్యాపారి చెప్పడంతో.. రూ.35 వేలకు ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం అబిడ్స్ లోని కార్యాలయంలో ఇందిరా వసంత రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  అధికారిణి ఇందిరా వసంతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.

ALSO READ | గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలె: మారం జగదీశ్వర్