పన్నులు కట్టేది 1.5కోట్ల మంది! ఐటీఆర్ వేసేది 6.5కోట్ల మంది

ఇట్లా ఎందుకంటే 5 లక్షల మహిమ

ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఏటా పన్నుచెల్లింపుదారుల సంఖ్య తగ్గుతున్నదే తప్ప పెరగడంలేదు. ఇందుకు ప్రధాన కారణం ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ ను రూ. ఐదు లక్షల దాకా పెంచడమేనని ఫైనాన్షియల్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. దీనివల్ల చాలామంది డిడక్షన్స్ చూపిస్తూ ప్రభుత్వానికి నయా పైసా చెల్లించడం లేదని అంటున్నారు. మరికొందరు పన్ను కట్టినప్పటికీ, రీఫండ్ల రూపంలోఆ మొత్తాన్ని వెనక్కి
తీసుకుంటున్నారు.

న్యూఢిల్లీ: మనదేశంలో ఏటా 6.5 కోట్ల మంది ఐటీ రిటర్నులు (ఐటీఆర్‌‌) అందజేస్తున్నా, వీరిలో పన్నులు చెల్లించేవారి సంఖ్య 25 శాతం కూడా దాటడం లేదు. మిగతా 75 శాతం మంది పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా డిడక్షన్స్‌ చూపిస్తున్నారు. మరికొందరు రీఫండ్‌‌ల రూపంలో చెల్లించిన పన్ను మొత్తాన్ని వాపసు తీసుకుంటున్నారు. ఎంతో కొంత పన్ను కట్టే వారి సంఖ్య 1.5 కోట్ల మంది వరకు ఉంది. వీరిలో వ్యక్తులు, కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌పేయర్లు, హిందూ అవిభాజిత కుటుంబాలు ఉన్నాయి. పన్ను కట్టాల్సిన ప్రతి ఒక్కరూ చెల్లించాలని, ఎగ్గొట్టవద్దని ప్రధాని నరేంద్రమోడీ రిక్వెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఐటీశాఖ ఈ వివరాలను తెలియజేసింది. మన దేశ జనాభా 130 కోట్లు ఉంటే, ట్యాక్స్‌‌పేయర్ల సంఖ్య 1.5 కోట్లు కూడా దాటకపోవడంపై ప్రధాని అసంతృప్తి ప్రకటించారు.

అత్యధికులు రూ. ఐదు లక్షల బ్రాకెట్లోకి…
ఎక్కువ మంది అసెసీలు రూ.ఐదు లక్షల ట్యాక్స్‌‌ బ్రాకెట్లోకి వస్తుండటంతో ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం ఉండటం లేదని ట్యాక్స్‌‌ప్లానర్లు చెబుతున్నారు. పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.ఐదు లక్షలకు పెంచుతున్నట్టు 2019 బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. కేంద్ర ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ తాజా లెక్కల ప్రకారం రూ. ఐదు లక్షల ట్యాక్స్‌ బ్రాకెట్లోకి వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2014 ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య 69 లక్షలు ఉండగా, ఇది క్రమంగా పెరిగి గత ఆర్థిక సంవత్సరం నాటికి 1.45 కోట్ల మందికి చేరింది. పన్ను కట్టేవారి సంఖ్య విపరీతంగా తగ్గుతున్నది. దీంతో అప్రమత్తమైన ఐటీశాఖ ట్యాక్స్‌‌పేయర్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం డేటా ఎనలిటిక్స్‌ వంటి టెక్నాలజీని వాడుతోంది. ఇతర డిపార్టుమెంట్లకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వివరాలు రాబడుతోంది. సెబీ వంటి ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. మూలం వద్దే పన్నును వసూలు చేస్తోంది. ఉదాహరణకు.. కంపెనీలే ఉద్యోగి జీతం నుంచి పన్నుమొత్తాన్ని వసూలు చేసి ఐటీశాఖకు పంపడం వంటివి. క్యాష్‌ ట్రాన్సాక్షన్లకు పరిమితులు విధిస్తూ డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహిస్తోంది. ట్యాక్స్‌‌పేయర్ల సంఖ్యను పెంచడానికి ఆర్థిక లావాదేవీలపై నిఘా ఎక్కువ కావడంతో వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా 2017 నుంచి జీఎస్టీ విధానం వచ్చాక ట్యాక్స్‌ ఆఫీసర్ల వేధింపులు ఎక్కువయ్యాయంటూ ప్రభుత్వానికి కంప్లెయింట్స్‌‌ వెళ్లాయి.తమ టార్గెట్ లను చేరుకోవడానికి తమను జీఎస్టీ ఫీల్డ్‌ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దీంతో చిన్న కంపెనీలు ఆఫీసర్లను కలవాల్సిన అవసరం లేకుండా ఫేస్‌‌ లెస్ అసెస్‌‌మెంట్‌‌ విధానాన్ని అమలుచేస్తున్నారు.

హోటల్ బిల్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా..
మీరు హోటల్‌‌లో ఇరవై వేల రూపాయలకు మించి బిల్లు కట్టినా ..డొమెస్టిక్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌‌ టికెట్‌‌ బుక్ చేసుకున్నా.. ఐటీ డిపార్ట్‌‌మెంట్ కన్నేసి ఉంచవచ్చు. పన్ను ఎగవేతలను తగ్గించి, పన్ను బేస్ పెంచేందుకే ఈ ప్రయత్నమని ఆఫీసర్లు చెబుతున్నారు. రూ.50 వేలకు మించిన లైఫ్ ఇన్సూరెన్స్‌ను, రూ.20 వేలకు మించిన హెల్త్ ఇన్సూరెన్స్‌ కొన్నా, ఫారిన్ వెళ్లినా, రూ.లక్షకు పైబడిన స్కూల్, కాలేజీ ఫీజులను చెల్లించినా రిపోర్టబుల్‌‌ ఫైనాన్షియల్‌‌ నాన్ ట్రాన్సాక్షన్‌‌గా గుర్తించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. లక్ష రూపాయలకు మించి వైట్ గూడ్స్, జ్యూయల్లరీ, పెయింటింగ్స్ కొనుగోళ్లను, డీమాట్ అకౌంట్లను, బ్యాంక్ లాకర్లను కూడా స్టేట్‌‌మెంట్‌ ‌ఆఫ్‌‌ ఫైనాన్షియల్‌‌ నాన్ ట్రాన్సాక్షన్‌ (ఎస్‌‌ఎఫ్‌‌టీ) లిస్టులో చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే ట్యాక్స్‌‌పేయర్ల సంఖ్య పెరుగుతుందని గవర్నమెంటు భావిస్తోంది. రూ.30 లక్షలకు పైబడి బ్యాంక్ ట్రాన్సాక్షన్లను కూడా కచ్చితంగా ఇన్‌‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో చూపాలి.

For More News..

ఇంట్లో నలుగురు మృతి.. ఒక్కోచోట ఒక్కొక్కరి మృతదేహం

ఆపరేషన్ మేడ్చల్.. యాక్షన్ ప్లాన్ షురూ..

చైనాకు రాష్ట్రపతి కోవింద్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్