- ఎస్‌టీసీజీ, ఎల్‌టీసీజీ, ఎస్‌టీటీ పెంచడంతో ఇంట్రాడేలో భారీగా పడ్డ నిఫ్టీ, సెన్సెక్స్
- రాణించిన ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు.. నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు బడ్జెట్ రోజు రోలర్ కోస్టర్ రైడ్ చేశాయి. ఈక్విటీలపై షార్ట్ టెర్మ్, లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచడంతో నిఫ్టీ, సెన్సెక్స్ మంగళవారం సెషన్‌లో ఒకటిన్నర శాతానికి పైగా పతనమయ్యాయి. కానీ కొన్ని ప్రొడక్ట్‌లపై ట్యాక్స్ మినహాయింపులు , కస్టమ్స్ డ్యూటీలను ప్రభుత్వం తగ్గించడంతో ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభపడ్డాయి.
ఫలితంగా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఇంట్రాడే కనిష్టాల నుంచి రికవరై ఫ్లాట్‌గా సెషన్‌ను ముగించాయి. ఇంట్రాడేలో 1,200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, చివరికి 73 పాయింట్ల (0.09 శాతం) లాస్‌తో 80,429 దగ్గర సెటిలయ్యింది. ఈ ఇండెక్స్ 79,224 దగ్గర ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24,479 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 1.77 శాతం పతనమై 24,074 వరకు పడింది.
సెన్సెక్స్‌లో టైటాన్ షేర్లు 6 శాతం వరకు పెరగగా, ఐటీసీ షేర్లు 5 శాతం ర్యాలీ చేశాయి. అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. మరోవైపు లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం నికరంగా రూ.2,975 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.1,418 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
షేర్లపై షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ) ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచడం, లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్‌టీసీజీ) ను 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడంపై మార్కెట్ నెగెటివ్‌గా స్పందించిందని, రానున్న సెషన్లలో కూడా మార్కెట్ పడొచ్చని సిట్రస్ అడ్వైజర్స్ ఫౌండర్ సంజయ్ సిన్హా అన్నారు. ఫిస్కల్ డెఫిసిట్‌ను ప్రభుత్వం తగ్గించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకోవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు పెంచడం, రూరల్ ఎకానమీపై ఫోకస్ పెట్టడంతో ఇంట్రాడే నష్టాల నుంచి బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు రికవర్ అయ్యాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే అన్నారు.
క్యాపెక్స్ పెరుగుతుందని ఇన్వెస్టర్లు ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. కానీ, బడ్జెట్ మిశ్రమంగా ఉందని అభిప్రాయప్డడారు. బ్రాడ్‌మార్కెట్ చూస్తే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మంగళవారం 0.74 శాతం పడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టపోయింది. సెక్టార్ ఇండెక్స్‌లలో కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, సర్వీసెస్, హెల్త్‌కేర్, టెక్ ఎక్కువగా లాభపడ్డాయి.
మరోవైపు రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ ఎక్కువగా పడ్డాయి. కాగా, 2023 బడ్జెట్ రోజు సెన్సెక్స్ 0.26 శాతం పెరిగి 59,708 దగ్గర క్లోజయ్యింది. 2022 బడ్జెట్ రోజు 1.46 శాతం ఎగిసి 58,863 దగ్గర సెటిలయ్యింది. 2021 బడ్జెట్ రోజు 5 శాతం ర్యాలీ చేసి 48,600 దగ్గర ముగిసింది. 2020 బడ్జెట్ రోజున మార్కెట్ 2.48 శాతం పడింది.