బీసీసీఐ, ఐసీసీల మధ్య ట్యాక్స్​ వార్

ఇండియాలో జరిగే టీ20వన్డే వరల్డ్‌‌కప్స్‌‌ ‘ట్యాక్స్​ ఎగ్జెంప్షన్​ గ్యారంటీ’పై రగడ

ఐసీసీ ఎలక్షన్స్​ ముందు తెరపైకి

ముంబై: కరోనా వైరస్‌‌ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో.. ఐసీసీలో ఎన్నికల  వేడి మొదలైంది.  క్రికెట్‌‌ పెద్దన్న బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎప్పటి నుంచో ఉన్న రాజకీయ వైరం తీవ్రమైంది. ఇండియా ఆతిథ్యం ఇచ్చే 2021 టీ20 వరల్డ్‌‌ కప్‌‌, 2023 వన్డే వరల్డ్‌‌కప్‌‌ విషయంలో ఇరు వర్గాల  మధ్య ఈ– -మెయిల్‌‌ వార్‌‌ నడుస్తోంది.  ఈ రెండు మెగా టోర్నీలకు సంబంధించిన ట్యాక్స్‌‌ ఎగ్జెంప్షన్స్‌‌ (పన్ను మినహాయింపు)పై గ్యారంటీ లెటర్‌‌ విషయంలో ఇండియా బోర్డు, ఇంటర్నేషనల్‌‌ బాడీ మధ్య చాలా కాలం నుంచి గొడవ జరుగుతోంది. బీసీసీఐ గ్యారంటీ సమర్పించడానికి ఇప్పటికే డెడ్‌‌లైన్‌‌ కూడా ముగిసింది. దాంతో, పన్ను మినహాయింపుపై ఒక పరిష్కారం రాబట్టేందుకు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని ఐసీసీ లీగల్ హెడ్‌‌  జొనాథన్‌‌ హాల్‌‌ బీసీసీఐ లీగల్‌‌ హెడ్‌‌కు లెటర్‌‌ రాయడం చర్చనీయాంశమైంది.  అయితే, ట్యాక్స్‌‌ ఎగ్జెంప్షన్ విషయాన్ని సెంట్రల్‌‌ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇండియన్‌‌ క్రికెట్‌‌ బోర్డు చాలా కాలంగా ట్రై చేస్తోంది. కానీ, రెండు నెలల నుంచి లాక్‌‌డౌన్‌‌ ఉండడంతో సంబంధిత ప్రభుత్వ వర్గాలు ఇప్పుడున్న అత్యవసర పరిస్థితులపై మాత్రమే దృష్టి సారించాయి.

క్రికెట్‌‌ సహా మరే విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేవు. దాంతో,  నిర్ణీత గడువు ప్రకారం ఒప్పందాన్ని నెరవేర్చే పరిస్థితులు లేవంటూ బీసీసీఐ ‘ఫోర్స్‌‌ మెజ్యూర్‌‌’ నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. కానీ, ఇప్పుడు సొసైటీ ఎదుర్కొంటున్న సమస్యను పట్టించుకునే స్థితిలో లేని ఐసీసీ.. ఇండియన్‌‌ బోర్డును మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ‘బీసీసీఐ ఇచ్చిన ఫోర్స్‌‌ మెజ్యూర్ నోటిఫికేషన్‌‌  దృష్ట్యా.. హోస్ట్‌‌ అగ్రిమెంట్‌‌లోని 20.1(ఎ) క్లాజ్‌‌ మేరకు బీసీసీఐ పై ఉన్న బాధ్యతను మేం గుర్తు చేస్తున్నాం. అలాగే, 20.2 క్లాజ్‌‌ ప్రకారం 2020 మే 18 తర్వాత ఏ సమయంలో అయినా హోస్ట్‌‌ అగ్రిమెంట్‌‌ను రద్దు చేసే అధికారం ఐబీసీ (ఐసీసీ బిజినెస్‌‌ కార్పొరేషన్‌‌)కు ఉంది’ అని హాల్‌‌.. ఐసీసీ తరఫున బీసీసీఐకి రాసిన లెటర్‌‌లో పేర్కొన్నారు. అంటే వచ్చే టీ20, వన్డే వరల్డ్‌‌ కప్‌‌ ఆతిథ్య హక్కులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

డెడ్‌‌లైన్‌‌ను జూన్‌‌ 30 వరకు గానీ లేదా లాక్‌‌డౌన్‌‌ ముగిసిన మరో నెల వరకు గానీ పొడిగించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి, హాల్‌‌కు లెటర్‌‌ రాసింది. కానీ, గడుపు పొడిగించాలన్న విజ్ఞప్తిని అంగీకరించడానికి ఐబీసీ సిద్ధంగా లేదని ఐసీసీ స్పష్టం చేయడం గమనార్హం. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని డెడ్‌‌లైన్‌‌ను కొన్ని నెలలు పొడిగించకపోవడానికి ఎలాంటి కారణాలు కనబడడం లేదని బోర్డు వర్గాలు అంటున్నాయి. ‘ఐసీసీ మెంబర్‌‌ బోర్డులకు చెందిన డైరెక్టర్లతోనే ఐబీసీ నడుస్తుంది. మరి, గడువు పొడిగించొద్దనేందుకు సదరు డైరెక్టర్లంతా ఒప్పుకున్నారా? ఆ డాక్యుమెంట్‌‌పై సంతకం చేశారా? చేస్తే దాన్ని బీసీసీఐకి చూపించండి’అని డిమాండ్‌‌ చేస్తున్నాయి. తాము ఎలాంటి డాక్యుమెంట్‌‌పై సంతకం చేయలేదని ముగ్గురు డైరెక్టర్లు స్పష్టం చేశారు. ‘ఇది పూర్తిగా పొలిటికల్‌‌ గేమ్‌‌ అని అర్థమవుతోంది. ఐసీసీలో ఉన్న ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు. ఈ మోసాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది’ అని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఈనెల 26 నుంచి జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్స్‌‌లో బీసీసీఐ ఈ విషయాన్ని ప్రస్తావించనుంది. ఐసీసీతో తాడోపేడో తేల్చుకునే అవకాశం ఉంది.

సామరస్యంగా పరిష్కరించుకుంటాం: ఐసీసీ ప్రతినిధి

ఈ గొడవపై  ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు  జొనాథన్‌‌ హాల్‌‌ మెయిల్‌‌కు భిన్నంగా స్పందించారు. ఇరు వర్గాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ‘ట్యాక్స్‌‌ ఎగ్జెంప్షన్ ఇష్యూను పరిష్కరించేందుకు ఐసీసీ, బీసీసీఐ కలిసి పని చేస్తున్నాయి. అగ్రిమెంట్‌‌లో  స్పష్టమైన  టైమ్‌‌ లైన్స్‌‌ ఉంటాయి. వాటి ప్రకారం మేం సమన్వయంతో  ముందుకెళ్తూ  వరల్డ్‌‌క్లాస్‌‌ ఈవెంట్లు సక్సెస్‌‌ఫుల్‌‌గా జరిగే విధంగా, క్రికెట్‌‌లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తాం. దీనికి తోడు మేం చెప్పే ట్యాక్స్ ఇష్యూల పరిష్కారం కోసం టైమ్‌‌లైన్స్‌‌కు  ఐసీసీ అంగీకారం తెలిపింది’ అని పేర్కొన్నారు. మరోవైపు  ఐసీసీ చైర్మన్‌‌గా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న శశాంక్‌‌ మనోహర్‌‌, చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ మను సావ్నే ఇద్దరూ బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ గంగూలీ, సెక్రటరీ జై షాతో  టచ్‌‌లో ఉన్నారు.

అయితే,  జొనాథన్‌‌ హాల్‌‌ పంపిన స్ట్రాంగ్ ఈ –మెయిల్‌‌ మాత్రం దాదాకు నచ్చలేదు.  ‘ట్యాక్స్‌‌  స్ట్రక్చర్‌‌ను బీసీసీఐ డిసైడ్‌‌ చేయదు. ఇండియన్‌‌ గవర్నమెంటే  నిర్ణయిస్తుంది. ఎగ్జెంప్షన్ సాధ్యం అవుతుందో లేదో కూడా ప్రభుత్వమే తేలుస్తుంది. ఫార్ములా వన్‌‌కు కూడా ట్యాక్స్‌‌ ఎగ్జెంప్షన్  ఇవ్వలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఐసీసీ చైర్మన్‌‌ పదవి కోసం నామినేషన్ల  ప్రక్రియ మంగళవారం మొదలవనుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా  మెయిల్స్‌‌ ఎందుకు వస్తున్నాయో  మేం అర్థం చేసుకోగలం. టీ20, వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఇప్పడే జరిగేవి కావు కాబట్టి కొంత కాలం వేచి చూడొచ్చు. గ్యారంటీ లెటర్‌‌ గడువు విషయానికి వస్తే లాక్‌‌డౌన్‌‌ ముగిసేంత వరకూ దీనిపై మేం ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి లేదు అని ఐసీసీకి స్పష్టం చేశాం’ అని బీసీసీఐ సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు.

For More News..

మాస్క్ అవసరం లేకున్నా అలవాటైపోయింది

బంగారం రేటు ఎందుకు పెరిగిందంటే..

మరో ఐదురోజులు వడగాడ్పులు

బర్త్‌‌ డేకు పిలిచి.. మత్తు మందు కలిపి