- టీబీ కేసులు మళ్లీ పెరుగుతున్నయ్
- 10 నెలల్లోనే 2,243 మందికి పాజిటివ్
- కరోనా తర్వాత వేగంగా పెరుగుతున్న కేసులు
- మాస్క్‌లు పెట్టకపోవడం, డిస్టెన్స్ పాటించకపోవడమే కారణమంటున్న డాక్టర్లు
నల్గొండ, వెలుగు : కరోనా వల్ల తగ్గుముఖం పట్టిందనుకున్న టీబీ మళ్లీ కలవరం సృష్టిస్తోంది. నల్గొండ జిల్లాలో టీబీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నెలకు సగటున 150 నుంచి 200 కేసులు నమోదవుతున్నాయంటే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. కరోనా వ్యాప్తి చెందకుండా మాస్క్‌లు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంతో గత రెండేళ్లలో టీబీ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా టీబీ అంతరించిపోతుందన్న అభిప్రాయం కూడా అధికారుల్లో వ్యక్తమైంది. కానీ కరోనా కేసులు తగ్గిపోవడంతో జనాలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మాస్క్‌లు పెట్టకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం వంటి కారణాలతో టీబీ వ్యాప్తి చెందుతోంది. మరో వైపు కరోనా సోకిన వారిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.
నెలకు 224 కేసులు
నల్గొండ జిల్లాలో నెలకు సగటును 224 మంది టీబీ బారిన పడుతున్నారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,045 కేసులు నమోదైతే, ఈ సంవత్సరం పది నెలల్లోనే 2,243 మందికి టీబీ సోకింది. వ్యాధి బారిన పడి 30 మంది చనిపోయారు. డిసెంబర్ నెలాఖరు వరకు టీబీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,700 చేరొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 2020లో నల్గొండ జిల్లాలో 2,631 టీబీ కేసులు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 2,045కు పడిపోయింది. కరోనా టైంలో పాటించిన జాగ్రత్తలతో టీబీ కూడా కంట్రోల్ అయింది. కానీ మళ్లీ ఇప్పుడు జనాలు మూములుగానే జీవిస్తున్నారు. కరోనా తరహాలోనే తుంపర్లు, తీవ్రంగా దగ్గుతో బాధపడుతున్న వారిలో టీబీ సింప్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ జబ్బు సోకిన వాళ్లు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఆఫీసర్లు చెబుతున్నారు. లేదంటే టీబీ వ్యాధిగ్రస్తులతో ఎదురెదురుగా మాట్లాడినా, తుంపర్లు, దగ్గు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతుందని చెబుతున్నారు.
జిల్లాలో స్పెషల్ డ్రైవ్‌లు
టీబీ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా టీబీ కంట్రోల్ బోర్డు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి లక్ష మందిలో 1500 మందికి టీబీ టెస్ట్‌లు చేస్తున్నారు. 25 పీహెచ్‌సీల్లో వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ గుర్తించిన కేసులే కాకుండా, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నమోదైన టీబీ కేసులకు జిల్లా కంట్రోల్ బోర్డు నుంచి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ప్రతి ఆశా వర్కర్ పేషెంట్ల ఇండ్లకు వెళ్లి మరీ మందులు వేయిస్తున్నట్లు ఆఫీసర్లు చెప్పారు.
పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి
ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారికి టీబీ సోకే ప్రమాదం ఉంటుంది. డయాబెటిక్, బీపీ, హెచ్‌ఐవీ, గర్బిణులు జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోవడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. పేషెంట్లు క్రమం తప్పకుండా మందులు వాడాలి. పాలు, గుడ్లు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
- కల్యాణ్ చక్రవర్తి, టీబీ కంట్రోల్ అధికారి