రాష్ట్రంలో టీబీ డేంజర్​ బెల్స్: ఏడాదిన్నరలో 1.45 లక్షలకుపైగా కేసులు

రాష్ట్రంలో టీబీ డేంజర్​ బెల్స్: ఏడాదిన్నరలో 1.45 లక్షలకుపైగా కేసులు
  • ఇందులో 2 వేల కంటే ఎక్కువ మంది మృతి
  • నాలుగేండ్లలో టీబీ బారిన 2.70 లక్షల మంది
  • 2025 కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం
  • సర్కారుకు సవాల్​గా తాజా గణాంకాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  టీబీ (క్షయ) వ్యాధి  విజృంభిస్తున్నది. సైలెంట్​ కిల్లర్​గా భావించే ఈ వ్యాధి నియంత్రణకు గడిచిన 50 ఏండ్లుగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఏటా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. -ఏడాదిన్నరలో 1.45 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, -ఇందులో 2 వేల మందికిపైగా మృతి చెందారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ రాష్ట్రంలో 70,546 మంది టీబీ బారిన పడినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్​ వరకు అంటే పది నెలల్లో ఈ వ్యాధి కారణంగా 1,004 మంది మృతిచెందారు. నిరుడు అత్యధికంగా 74,986 మంది టీబీ బారిన పడగా, 1,659 మంది కన్నుమూశారు. 2022లో 72,391 మంది, 2021లో 59,947 మంది క్షయ బారిన పడగా.. వరుసగా1,892 మంది, 2,055 మంది మృతిచెందారు.  దేశవ్యాప్తంగా టీబీ కారణంగా  ఏటా 5లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా టీబీ మరణాల సంఖ్య తగ్గుతున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం దడ పుట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో 2025 నాటికి టీబీని పూర్తిగా అంతం చేయాలని కేంద్రప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి తాజా గణాంకాలు సవాల్​గా మారాయి. 

 గుర్తింపులో జాప్యం.. 

ప్రజలు దీర్ఘకాలిక జ్వరాలు, దగ్గు, జలుబును సాధారణ ఇన్ఫెక్షన్​ లాగానే భావిస్తున్నారు. రాత్రిళ్లు ఒళ్లంతా చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం జనరల్​ ప్రాబ్లమే అనుకొని,  ట్రీట్​మెంట్ తీసుకోవట్లేదు. ఇలా చాలా వరకు క్షయ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. టీబీకి చికిత్స చేయకుండా వదిలేస్తే..  క్రమంగా ఊపిరితిత్తులకు చిల్లులు పడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న టీబీ కేసుల్లో 80 శాతం కేసులు లంగ్స్​పై  ప్రభావం చూపుతున్నవే.  టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ప్రభుత్వం ఇల్లిల్లూ తిరుగుతూ సర్వే చేస్తున్నా.. కేసులు బయటకు రావడం లేదు. 

సర్వేలు నామమాత్రంగానే చేస్తుండడమే ఇందుకు కారణమనే  ఆరోపణలు ఉన్నాయి. కాగా, టీబీ అంటువ్యాధి కావడంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రారంభ దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించకపోవడం వల్ల వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మినప్పుడు సూక్ష్మ బిందువులు గాలిలోకి విడుదలై.. ఇతరులకు వ్యాధి సంక్రమిస్తున్నది. అలాగే, ఎవరికైనా క్షయ నిర్ధారణ జరిగినప్పుడు  వారితో ఉన్న కాంటాక్ట్  కేసులను  ట్రేస్​  చేయడంలో మెడికల్​ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు.  దీంతో కొన్ని రోజుల తర్వాత కాంటాక్ట్ కేసులు కూడా వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు. 

పెరుగుతున్న ఎండీఆర్​ టీబీ కేసులు..

క్షయ ప్రమాదకర అంటువ్యాధి అయినప్పటికీ ప్రారంభ దశలో గుర్తించి, చికిత్స అందిస్తే దానిని నివారించవచ్చు. టీబీ చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు 6 – 9 నెలల పాటు వివిధ రకాల మందులను అధిక మొత్తంలో వాడాల్సి ఉంటుంది. అప్పుడుగానీ శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియా పూర్తిగా నాశనం కాదు.  కానీ చాలా మంది ఒకటి, రెండు నెలలు వాడగానే లక్షణాలు తగ్గిపోవడంతో మందులను పక్కకు పెట్టేస్తున్నారు.

దీంతో బ్యాక్టీరియా మరింత పుంజుకొని, ఆ వ్యక్తిపై తీవ్రంగా ఎటాక్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ఆ రోగుల్లో టీబీ కాస్తా మల్టీ డ్రగ్​ రెసిస్టెంట్ టీబీ(ఎండీఆర్​-టీబీ)గా మారుతున్నదని  డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి వారి విషయంలో మందులు కూడా పనిచేయక పోవచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల  టీబీ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచించిన కోర్సులను పూర్తిగా వాడాలని  సూచిస్తున్నారు. 

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి 

టీబీ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా  ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే క్షయను నివారిం చవచ్చు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి, చికిత్స అందివ్వడం ద్వారా వేరొకరికి సోకకుండా అడ్డుకోవచ్చు.  ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులపై త్వరగా అటాక్​ చేస్తుంది.

డయాబెటిస్​, హెచ్ఐవీ, క్యాన్సర్​, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, పొగాకు ఎక్కువగా వినియోగించేవారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండ డం వల్ల టీబీ సోకే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. టీబీ వ్యాధి సోకితే వెంటనే ట్రీట్​మెంట్ ప్రారంభించాలి. 

ప్రజల్లో అవగాహన రావాలి 

టీబీపై  ప్రజల్లో అవగాహన లేక లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండు వారాలకు మించి జ్వరం, కఫంతో కూడిన దగ్గు, చాతి నొప్పి, రాత్రిళ్లు చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే డాక్టర్​ ను సంప్రదించాలి. లేదంటే మీ కుటుంబ సభ్యులను వ్యాధి బారిన పడేసినవారవుతారు. ప్రభుత్వాలు సైతం  టీబీ లక్షణాలు, చికిత్స, ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. టీబీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.

- డాక్టర్​ ఎం. రాజీవ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్