టీబీని లైట్ తీస్కుంటే చాలా డేంజర్

కరోనా మొదలయ్యాక చాలామందికి కొత్తగా హెల్త్ ప్రాబ్సమ్స్​ వస్తున్నాయి. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నవాళ్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈమధ్య ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న జబ్బుల్లో ట్యూబర్​క్యులోసిస్ (టీబీ) ఒకటి.  ఒకప్పుడు టీబీ​ వస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అనుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు మెరుగైన ట్రీట్మెంట్ ఉంది. అలాగని టీబీని నిర్లక్ష్యం చేయొద్దు. టీబీకి సరైన ట్రీట్మెంట్ తీసుకోకుంటే ప్రాణాల మీదకు వస్తుంది అంటున్నారు పల్మొనాలజిస్ట్​ రాఘవేంద్ర రెడ్డి.  

టీబీ అనేది ఒక అంటువ్యాధి. ఇది  మైకోబ్యాక్టీరియం ట్యుబర్​క్యులోసిస్​ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకప్పుడు టీబీ వస్తే, రెండు మూడు నెలలు దవాఖానల్లో ఉండి  ట్రీట్మెంట్ తీసుకునేవాళ్లు. ఇప్పుడు అడ్వాన్స్​డ్ ట్రీట్మెంట్ వచ్చాక  టీబీ నుంచి కోలుకునేవాళ్ల సంఖ్య పెరిగింది. అయితే, గత ఆరు నెలల నుంచి టీబీ కేసులు మళ్లీ పెరిగాయి. అందుకు కరోనా కూడా ఒక కారణం. అదెలాగంటే... కరోనా టైంలో చాలామందికి టీబీ ట్రీట్మెంట్ ఆగిపోయింది. కొందరు మెడిసిన్స్ వేసుకోలేదు. ​టీబీ లక్షణాలు ఉన్నవాళ్లు టెస్ట్​లు చేయించుకోలేదు. అందరూ ఇంట్లోనే ఉండడంతో ఒకరి నుంచి మరొకరికి టీబీ వ్యాపించి, కేసులు పెరుగుతున్నాయి. 

ఎలా వ్యాపిస్తుందంటే

టీబీ పేషెంట్లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ట్యుబర్​ క్యులోసిస్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఒకసారి ఒంట్లోకి చేరిందంటే  జీవితాంతం మన లోపలే ఉంటుంది. అది ఎప్పుడు యాక్టివ్​ అవుతుంది? ఇన్ఫెక్ట్​ చేస్తుంది? అనేది చెప్పలేం. ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా యాక్టివ్​ అవుతుంది.  
ఊపిరితిత్తుల్లోనే కాకుండా

టీబీని చాలామంది ఊపిరితిత్తుల జబ్బు 

అనుకుంటారు. కానీ, టీబీ శరీరంలో ఏ ఆర్గాన్​కు అయినా రావొచ్చు.  అయితే, 80 శాతం టీబీలు ఊపిరితిత్తుల్లోనే వస్తాయి. మిగతా 20 శాతం టీబీ ఇన్ఫెక్షన్లు పొట్ట, ముఖం, మెదడు, మూత్రపిండాలు... ఇలా శరీరంలో ఏ అవయవంలో అయినా కనిపిస్తాయి.

ఈ లక్షణాలు ఉంటే

విపరీతమైన దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, సాయంత్రం అవ్వగానే చలేస్తుండడం టీబీ లక్షణాలు. ఇవే కాకుండా టీబీ సోకితే చెమటలు పడతాయి. ఆకలి తగ్గిపోతుంది. తొందరగా అలసిపోతారు. ఛాతిలో నీళ్లు చేరడం వల్ల  దమ్ము కూడా వస్తుంది. మెదడులో టీబీ ఇన్ఫెక్షన్ ఉంటే తలనొప్పి వస్తుంది. మెదడుని కప్పి ఉంచే పొరలు ఉబ్బుతాయి. కిడ్నీలో టీబీ వస్తే, వాటి పనితీరు దెబ్బతింటుంది. 

వీళ్లకు  రిస్క్​ ఎక్కువ

ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు తొందరగా టీబీ బారిన పడతారు. హెచ్​ఐవీ పేషెంట్స్, డయాబెటిస్​ కంట్రోల్​లో లేనివాళ్లు, పోషకాహార లోపం, ఆర్గాన్ ట్రాన్స్​ప్లాంట్, మూత్ర పిండాల సమస్య ఉన్న వాళ్లకు టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇమ్యూనిటీ తక్కువ ఉండే  స్కూల్, కాలేజీ పిల్లలకు కూడా టీబీ వస్తుంది. 

డయాగ్నసిస్

తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్​–రే ద్వారా టీబీని డయాగ్నస్​ చేస్తారు. ఇంట్లో ఒకరికి టీబీ వస్తే, మిగతా వాళ్లు కూడా టీబీ టెస్ట్ చేయించుకోవాలి.  అయితే టీబీ లక్షణాలు అప్పుడే బయట పడకపోవచ్చు. అలాగని ఒంట్లో టీబీ బ్యాక్టీరియా లేదని అనుకోవద్దు. తర్వాత ఎప్పుడైనా, ఏ ఆవయవాన్ని అయినా ఈ బ్యాక్టీరియా  ఇన్ఫెక్ట్​ చేయొచ్చు. 

ఇవీ రకాలు

టీబీలో నార్మల్, మల్టీరెసిస్టెంట్, ఎక్స్​ట్రీమ్.. అని మూడు రకాలు ఉంటాయి. ముందుగా ఏ రకం టీబీ అనేది  తెలుసుకోవాలి. అంతేకాదు, టీబీ ఊపిరితిత్తుల్లో ఉందా? ముఖంలో ఉందా? పొట్టలో ఉందా? మెదడులో ఉందా? అనేది గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే... టీబీ రకాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. 

ట్రీట్మెంట్

మామూలు టీబీకి ఆరు నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది. అవసరమైతే మరికొన్ని రోజులు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. అదే మల్టీ రెసిస్టెంట్, ఎక్స్​ట్రీమ్ టీబీ ఉన్నవాళ్లకు 18 నుంచి 20 నెలలు ట్రీట్మెంట్ ఇస్తారు. పేషెంట్లను బట్టి కొందరికి 11నెలలు ట్రీట్మెంట్ సరిపోతుంది. అయితే, శరీరంలో ఎక్కడ టీబీ వచ్చినా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే ఇతర అవయవాలకు టీబీ ఇన్ఫెక్షన్​ సోకే అవకాశం ఉంది.