
కుర్చీలతో కొట్టుకున్న టీబీజీకేఎస్ నాయకులు
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ యూనియన్ లో వర్గపోరు మళ్లీ మొదలైంది.శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ పుట్టిన రోజు వేడుకలను జీడీకే 11వ గనిపై నిర్వహించడానికి యూనియన్ కు చెందిన ఆ గని పిట్ కార్యదర్శి నాయిని శంకర్ కేక్ ఆర్డర్ చేశారు. యూనియన్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న మరో నాయకుడు కెనడీ వేడుకలకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వలేదని పిట్ కార్యదర్శికి గుర్తు చేశాడు.
ఈ క్రమంలో పాత సంఘటనలను గుర్తు చేసుకుంటూ మాటకు మాట అనుకున్నారు. తిట్టు కున్నారు. అదే కార్యాలయంలో ఉన్న జీడీకే 2వ గనిలో పనిచేసే నాయకుడు పెంచాల తిరుపతి మమ్మల్ని తిడతావా అంటూనాయిని శంకర్‌పై చేయిచేసుకున్నాడు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో శంకర్ చొక్కా చిరిగిపోయింది. కార్యాలయంలో యూనియన్ కు చెందిన సెంట్రల్ కమిటీ, రీజియన్ కమిటీనాయకులు, ఏరియా ఉపాధ్యక్షుల సమక్షంలోనే శ్రేణుల మధ్య గొడవ జరగడంతో అంతా విస్తుపోయారు. చివరకు తన్నుకున్న వారిని విడిపించి అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. నాయిని శంకర్ తమను అనవసరంగా తిట్టాడని, కొట్టాడని కెనడీ, పెంచాల తిరుపతి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న గోదావరిఖనిలో జరగాల్సి న ఆర్జీ 1 ఏరియా టీబీజీకేఎస్ విస్తృత స్థాయి సమావేశం ఈ ఘటనలతో వాయిదా వేసినట్టు తెలిసింది.