ఎన్నికల యేడు గ్యారేజ్​లో టీకాంగ్రెస్​ : పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌ దిలీప్‌‌ రెడ్డి

ఎన్నికల యేడు గ్యారేజ్​లో టీకాంగ్రెస్​ : పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌ దిలీప్‌‌ రెడ్డి

సానుకూల రాజకీయ వాతావరణం ఉన్నపుడు తప్పటడుగులతో దాన్ని చెడగొట్టుకోవడం కాంగ్రెస్‌‌ పార్టీకి మామూలే! పొరపాట్లు వేరు తప్పులు వేరు! సంస్థాగతంగా తెలంగాణ కాంగ్రెస్‌‌లో ఇప్పుడు జరుగుతున్నవి పొరపాట్లు కావు, తప్పులు! అవి కూడా సరిదిద్దుకోలేని, సరిదిద్దుకున్నా పూర్వవైభవం పునరుద్ధరించలేనివి. దిద్దడానికి ఢిల్లీ నుంచి దిగిన దిగ్గీరాజా(దిగ్విజయ్‌‌ సింగ్‌‌) దినమంతా ఇరు వర్గాల వాదనలు విన్నారు. ఆయన మల్లిఖార్జున ఖర్గేకు నివేదించడమే తరువాయి. అంతిమంగా ఆ దిద్దుబాట్లు ఇచ్చే నికర ఫలితం ఏమిటి? అన్నదే ప్రశ్న! టీపీసీసీ నేత రేవంత్‌‌రెడ్డిని, ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్న కొందరు ‘సీనియర్లు’ మంగళవారం జరగాల్సిన తమ రెండో భేటీని వాయిదా వేసుకున్నారు. పార్టీ పంచాయితీ వీధిపోరుగా మారిందని గ్రహించిన అధినాయకత్వం, జాగు చేయకుండా క్రైసెస్‌‌ మేనేజర్‌‌ దిగ్విజయ్‌‌సింగ్‌‌ను రంగంలోకి దింపింది. ఈ పంచాయితీలు కేవలం ఆదిపత్యం కోసమో, అంతర్లీనమైన ఇగో’ల వల్ల వచ్చినవో అయితే అధినాయకత్వం సర్దుబాటు చేయొచ్చేమో కానీ, ఇవి అంతకు మించి లోతైన కుట్రలు, కుతంత్రాల నేపథ్యం కలిగిన అంశాలని పార్టీశ్రేణుల్లోనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, కాంగ్రెస్‌‌ అంతర్గత పోరును బయటి పార్టీలు కూడా కొంతమేర ప్రభావితం చేస్తున్నట్టే లెక్క!

సీనియర్లు పోతున్నారా? పంపిస్తున్నారా!

అంతర్గతంగా కాంగ్రెస్‌‌లోనే ఒకరి పొడ మరొకరికి గిట్టని వైరం రెండు వర్గాల మధ్య పెరిగింది. అధిష్టానం ఎంత చేసినా, సయోధ్య సాధ్యమా? అనే సందేహాలున్నాయి. ఎందుకంటే, ఎవరూ తమ నీడను తామే నమ్మలేని పరిస్థితి. మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి లేదు. పరస్పరం అనుమానాలు, అవమానాలు. ఇప్పుడున్న కృత్రిమ సంబంధాలతో ఐక్యంగా కలిసి పనిచేయడం దుస్సాధ్యమంటున్నారు. వరుసగా రెండు పర్యాయాలు(2014, 2018) ఓడిన పార్టీ ఇలా అంతర్గత కుమ్ములాటల్లో మునిగితేలితే, ఇక పౌరులు వీరిని నమ్మేదెట్లా? అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమౌతోంది. రేవంత్‌‌రెడ్డి ఆయన సొంత టీమ్‌‌ తయారు చేసుకుంటున్నారనే ఆగ్రహం పార్టీ నాయకుల్లో పెరిగింది. చాలా ఏండ్లుగా పార్టీలో ఉన్న పాత వారిని పక్కన పెడుతూ రాష్ట్రమంతటా ఇదే చేస్తున్నారని వ్యతిరేక వర్గం ఆరోపణ. భట్టి విక్రమార్క ఇంట్లో భేటీ అయిన సీనియర్లు, ఇతర ముఖ్య నాయకులు కొందరు ఆరంభం నుంచీ ఇదే భావనతో ఉన్నారు. తెలంగాణలో పీసీసీ, ఏఐసీసీ డెలిగేట్ల ఎంపిక నుంచి నిన్నా – మొన్నటి కార్యవర్గం కూర్పు వరకు, యాభై శాతం లేదా అంతకు మించి తనవారితో, ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వలసనేతలతో నింపారనే అభియోగాలున్నాయి. పార్టీలో సీనియర్లు, ముఖ్యులైన రాజగోపాలరెడ్డి, దాసోజు శ్రవణ్‌‌, శశిధర్‌‌రెడ్డి లాంటి వాళ్లు మామూలుగా పార్టీని వీడి వెళ్లిపోలేదని, వెళ్లే పరిస్థితులు కల్పించారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ‘ఏమిటీ రచ్చ? వారిని పిలిచి మాట్లాడండి, సర్దుబాటు చేసి ఐక్యంగా పనిచేసేట్టు చూడండి’ అని ఏఐసీసీ నేత మల్లిఖార్జున్‌‌ ఖర్గే, ఢిల్లీ ఇతర పెద్దలు చెప్పినపుడు, ‘నేను మాట్లాడలేను, వారు నా మాట వినరు’ అని రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి  మాణిక్కం ఠాగూర్‌‌ చేతులెత్తారని ఓ కథనం. అందుకే, దిగ్గీరాజాను దించారని, దాన్ని ఓ కొత్త నెత్తినొప్పిగా రేవంత్‌‌ వర్గం భావిస్తోందని పార్టీలో ప్రచారం. తటస్థంగా ఉండాల్సిన మాణిక్కం ఏకపక్షంగా రేవంత్‌‌ మనిషి అయిపోయారనేది చాలా కాలంగా ప్రత్యర్థి శిబిరం ఆరోపణ!

కోరికా అదే, ధీమా అదే!!

పార్టీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ఎంత ఉంటుందో... ఫలానా వారికి ముఖ్యమంత్రి కుర్చీ దక్కొద్దన్న దుగ్ద కూడా అంతే బలంగా ఉంటుంది కొందరు కాంగ్రెస్‌‌ నేతల్లో! ఆయా ఆకాంక్షల్ని బట్టి ఎవరి దారిలో వారు పనిచేస్తుంటారు. వ్యక్తిగత అభీష్టాలు ఒక్కోసారి పార్టీ ఉమ్మడి ప్రయోజనాలను దెబ్బతీస్తాయా? అంటే, తియ్యొచ్చు! పార్టీ భంగపోయినా సరే, తమ అభీష్టం నెరవేరాల్సిందే అన్న పట్టుదల కొందరిది. ఇటీవలి భారత్‌‌ జోడో యాత్ర తెలంగాణలో తిరుగుతున్నపుడు, గ్రూపు తగాదాలపై పాత్రికేయుల ప్రశ్నకు బదులిస్తూ కాంగ్రెస్‌‌ అగ్రనేత రాహుల్‌‌గాంధీ, ‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ’ అన్నది... ఇదేనేమో తెలియదు! టీపీసీసీ నేతగా రేవంతరెడ్డి వ్యవహారశైలి పట్ల కొందరికి అభ్యంతరాలు ఉండవచ్చు. కానీ, ‘రేపు పార్టీ అధికారంలోకి వస్తే, ఆయనే ముఖ్యమంత్రి అవుతారేమో? కాకుంటే బావుండు’ అనుకునే సీనియర్లే ఎక్కువ! ఇది కాంగ్రెస్‌‌ పార్టీలో కొత్త కాదు. దాని సంస్కృతిలో భాగమే! దీనికొక పాత ఉదాహరణ ప్రస్తావిస్తే, ఇక్కడ అది అసంగతమేం కాదు.‘ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసింది ఎవరు? ఆయన(వైఎస్‌‌ రాజశేఖరరెడ్డి), అంటే, ఆయన అద్దాల మేడలో ఉన్నారు. పార్టీలో ఇక్కట్లలో ఉన్నవారు విమర్శిస్తారు, రాళ్లుపడతాయి, పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే! కాదని, తానూ అంతకన్నా పెద్ద రాయి ఎదురు విసురుతానంటే ఎవరికి నష్టం? ఆయనకే, తానున్నది అద్దాల మేడ కదా!’ అని అసమ్మతి నేత మైసూరారెడ్డి మీడియా మిత్రులతో పిచ్చాపాటిలో అనేవారు. అదే మైసూరారెడ్డి కినుకతో, కాంగ్రెస్‌‌ను వీడి టీడీపీలోకి వెళుతున్నారని తెలిసినపుడు, ఆపడం మాజీ సీఎం ఒక్క నేదురుమల్లి జనార్దన్‌‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందని ఎవరో చెబితే, సకాలంలో ఆయన్ని పట్టుకోవడానికి కాళ్లకు చెప్పుల్లేకుండానే కారెక్కి, నేదురుమల్లి ఇంటికి పరుగెత్తారు వై.ఎస్‌‌! అధినేతలది అలాంటి బాధ్యత. రేవంత్‌‌ ధీమాయే వేరు! ఎవరో సన్నిహిత మిత్రులు ఆయనకు బాధ్యత గుర్తు చేస్తే, ‘చూడు, నడుచుకుంటూ వెళ్లినా... ఎన్నటికో ఓ నాటికి సీఎం అయితీరే వయసు నాది’ అని రేవంత్‌‌ బదులిచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ.

దిద్దుబాట్లు చేసుకుంటేనే..

ఇన్ని వైరుధ్యాల మధ్య పనిచేస్తున్న కాంగ్రెస్‌‌లో దిద్దుబాట్లు చేసుకుంటే తప్ప జనానికి పార్టీ దగ్గర కాలేదు. మరోవైపు జాతీయస్థాయిలో తన ప్రత్యర్థి బీజేపీ, తెలంగాణలో దూసుకుపోతోందని ప్రచారం జరుగుతున్న వేళ.... రాష్ట్రంలో పాలకపక్షానికి తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే కాంగ్రెస్‌‌ ప్రజల్లో ఆ నమ్మకం కలిగించగలదా? టీపీసీసీ ఆత్మపరిశీలన చేసుకుంటుందా? టీపీసీసీని అధిష్టానం అలా సరిదిద్దగలదా? ఇవన్నీ ప్రశ్నలే! చిక్కుముడులు విప్పేందుకు వచ్చిన పార్టీ మెకానిక్‌‌ దిగ్గీరాజా అందరి వాదనలు విన్నారు. రేవంత్​ వైఖరినైనా మార్చండి, లేదా రేవంత్​నైనా మార్చండి అన్నది అసమ్మతి నేతల ప్రధాన డిమాండ్​గా ఉన్నది. మాణిక్కం ఠాగూర్​ను రాష్ట్ర వ్యవహారాల నుంచి తప్పించి నట్టేనా? స్పష్టత ఇమ్మనీ కోరి ఉంటారు. పార్టీని నడిపే బాధ్యత అప్పగించినప్పుడు, సీనియర్లంతా సహకరించేలా చూడమనేదే రేవంత్, ఆయన మద్దతుదారులు కోరి ఉంటారు. అంతిమంగా అధిష్టానం ఏం నిర్ణయిస్తుంది, దానికి పార్టీలో రెండు గ్రూపులు ఎలా స్పందిస్తాయి అనేదానిపై తెలంగాణలో కాంగ్రెస్​ మనుగడ ఆధారపడి ఉన్నది. ఇక్కడే, తెలంగాణ యువవైతాళికుడుగా పేరుగన్న దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్‌‌ కవిత గుర్తొస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్‌‌ చిలుమెక్కి  తూట్లు పడ్డప్పుడల్లా కళాయి పోసి తళతళా మెరిపించేది కేంద్ర బృందమే.

నిబద్ధతకు తీవ్ర కరువు

సీఎల్పీలో ఒక చిన్న ఉద్యోగి కలిసినపుడు, ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. నిన్ను ఉద్యోగంలో పెట్టిచ్చిన ఫలానా ఎమ్మెల్యే ఎలా ఉన్నారు? ఎపుడైనా కలుస్తుంటావా?’ అనడిగితే, ‘ఏం కలుస్తాం సార్‌‌, ఇప్పుడు తనేమో వేరే పార్టీ అయిపాయె, ఎలా కలిసేది? కలవనే లేదు’ అంటూ నన్ను ఆశ్చర్యపరిచాడు. సీఎల్పీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తికున్నంత పార్టీ నిబద్ధత కూడా కాంగ్రెస్‌‌లో ఎన్నెన్నో పదవులు, హోదాలు అనుభవించిన ఎక్కువ మందిలో లేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 2014లో(21 మందిని), 2018లో (19 మందిని) కాంగ్రెస్‌‌ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే, మొదటి దఫా ఏడుగురు, తర్వాత 12 మంది పాలకపక్షంలోకి మారారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఇన్నేసి పదవులా? అంటూ నేడు విమర్శిస్తున్న అందరి చరిత్ర కూడా గొప్పదేమీ కాదు. ఇందులో శల్యులు, అంబిలు, శిశుపాలురు... రకరకాల వారున్నారు. నిత్యం ఇక్కడ కొనసాగుతూ ప్రత్యర్థి రాజకీయ పక్షం పేరోల్స్‌‌’లో నమోదైన వారూ కాంగ్రెస్‌‌లో ఉన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలోనే కాదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ ఇదే జరిగేది. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌, అదే యేడు లోక్‌‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడు కూడా... ఇవాళ రేవంత్‌‌రెడ్డిపై ఫిర్యాదులిచ్చిన వారిలో ఉన్నారు. ఫిర్యాదులు కూడా ఊరకే ఇచ్చారని కాదు. కొన్ని సార్లు కడుపు మండే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే, పాలకపక్షంపై పోరాటమని చెప్పి దర్జాగా ఓ సోషల్‌‌ మీడియా సెంటర్‌‌ నడుపుతూ, ఎక్కువగా పోస్టులు పార్టీలోనే గిట్టనివారిపై పెడుతున్నారన్నది వారి అభియోగం. దాడి చేసిన సర్కారు దర్యాప్తు సంస్థకు కూడా ఇటువంటి ఆధారాలు లభించాయని వారి వాదన!

- దిలీప్‌‌ రెడ్డి,

పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, 

పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్​ సంస్థ