టీసీఎస్​ లాభం రూ.12,380 కోట్లు..ఒక్కో షేరుకు 76 రూపాయల డివిడెండ్

5.6 శాతం పెరిగిన రెవెన్యూ 
ఒక్కో షేరుకు రూ.76  డివిడెండ్ 

న్యూఢిల్లీ: ఇండియాలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్​ డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ ​ఫలితాలను ప్రకటించింది. ఈసారి నికరలాభం ఏడాది లెక్కన 12 శాతం పెరిగి రూ.12,380 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది డిసెంబరు క్వార్టర్​లో రూ.11,058 కోట్ల లాభం వచ్చింది. 

రెవెన్యూ 5.6 శాతం పెరిగి 63,973 కోట్లకు చేరింది. అయితే  సీక్వెన్షియల్​గా ఇది 0.4 శాతం తగ్గింది. ఖర్చులు 6.33 శాతం పెరిగి రూ.48,550 కోట్లకు చేరాయి. ఈసారి ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి.  

మూడో క్వార్టర్​లో కంపెనీకి రూ.64,748 కోట్ల రెవెన్యూ, 12,534 కోట్ల నికరలాభం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలు నిజం కాలేదు. ఆర్డర్​ బుక్​ టోటల్ కాంట్రాక్ట్​ వాల్యూ (టీసీవీ) మాత్రం 10.2 బిలియన్​ డాలర్లకు చేరింది.

 ఇది మొదటి క్వార్టర్​లో 8.3 బిలియన్ డాలర్లు, రెండో క్వార్టర్​లో 8.6 బిలియన్​ డాలర్లు ఉంది. అన్ని కేటగిరీల్లో టీసీవీ భారీగా పెరిగినందుకు సంతోషంగా ఉందని టీసీఎస్​ సీఈఓ, ఎండీ కృతివాసన్​ అన్నారు. 

బీఎఫ్​ఎస్​ఐ, సీబీజీ వెర్టికల్స్​ కూడా వృద్ధిబాటలోకి వచ్చాయని అన్నారు. ఇక నుంచి కూడా అప్​స్కిల్లింగ్​, ఏఐలో పెట్టుబడులను కొనసాగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే కంపెనీ షేరుకు రూ.76 చొప్పున డివిడెండ్​, రూ.66 చొప్పున స్పెషల్ ​డివిడెండ్​ ప్రకటించింది.

విదేశీ మార్కెట్లలో ఇలా...

అమెరికా, యూరప్​ మార్కెట్లు ఆదాయం పరంగా నిలకడగా ఉన్నాయి. ఇండియా మార్కెట్​ 79.2 శాతం పెరిగింది. మిడిల్​ ఈస్ట్– ఆఫ్రికా 15 శాతం, ఆసియా–పసిఫిక్​ 5.8 శాతం, లాటిన్​ అమెరికా ఏడు శాతం పెరిగింది. ఉత్తర అమెరికా నుంచి ఆదాయం 2.3 శాతం తగ్గింది.

 యూరప్​, యూకేలు 4.1 శాతం పెరగగా, యూరప్​ మార్కెట్​ 1.5 శాతం తగ్గింది. వర్టికల్స్​ను గమనిస్తే.. రిసోర్సెస్​ అండ్​యుటిలిటీస్​ 3.4 శాతం, కన్జూమర్ ​బిజినెస్​ 1.1 శాతం, బీఎఫ్​ఎస్​ఐ0.9 శాతం పెరిగింది. ఈ క్వార్టర్లో ఉద్యోగుల సంఖ్య 5,370 తగ్గగా, రెండో క్వార్టర్లో మాత్రం 5,762 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 

గత డిసెంబరు నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.7 లక్షలకు చేరింది. తాజా క్వార్టర్​లో ఆపరేటింగ్​ మార్జిన్లు 24.5 శాతం ఉన్నాయి. ఏడాది లెక్కన ఇవి 50 బేసిస్​ పాయింట్లు తగ్గాయి. బీఎస్ఈలో గురువారం  కంపెనీ షేరు 0.68 శాతం తగ్గి రూ.4,036 వద్ద ముగిసింది.