ఆఫీస్ పరిసరాల్లో బాంబు పెట్టాం అని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో కొండాపూర్ లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది ఫేక్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్తు తెలియని వ్యక్తి కొండాపూర్లోని టీసీఎస్ కంపెనీకి ఫోన్ చేసి, కంపెనీలో బాంబు పెట్టాం అని బెదిరించాడు. అప్రమత్తమైన 1500 మంది ఉద్యోగులు ఆఫీస్ బయటకు వచ్చి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం విస్తృతంగా తనిఖీ చేసింది. ఈ ఆపరేషన్ లో బాంబు దొరకలేదు. దీంతో అది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించారు. కంపెనీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి కంపెనీ మాజీ ఉద్యోగి అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తిని బెంగళూరు ఉన్నట్లు గుర్తించామని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు.