న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టీసీఎస్ ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో రూ.11,909 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో సాధించిన రూ.11,342 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. కానీ, కంపెనీ మార్జిన్స్ తగ్గాయి. రెవెన్యూ 7.6 శాతం పెరిగి రూ.64,259 కోట్లకు పెరగగా, ఏప్రిల్– జూన్ క్వార్టర్ (క్యూ1) తో పోలిస్తే 2.62 శాతం పెరిగింది. బ్లూమ్‌బర్గ్ వేసిన రెవెన్యూ అంచనా రూ. 64,177 కోట్లను టీసీఎస్ అధిగమించగా, నెట్ ప్రాఫిట్ అంచనా రూ.12,547 కోట్లను మాత్రం అందుకోలేకపోయింది.
కంపెనీ షేర్లు గురువారం 0.60 శాతం నష్టపోయి రూ.4,227 దగ్గర సెటిలయ్యాయి. టీసీఎస్ ఆర్డర్ బుక్ గురించి తెలియజేసే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ (టీసీవీ) సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 8.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జూన్ క్వార్టర్ నాటికి ఇది 8.3 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. నార్త్ అమెరికా మార్కెట్ నుంచి 4.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ సెక్టార్ (బీఎఫ్‌ఎస్‌ఐ) నుంచి 2.9 బిలియన్ డాలర్లు, కన్జూమర్ బిజినెస్‌ల నుంచి 1.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
కొత్తగా 5,762 ఉద్యోగాలు..
సెప్టెంబర్ క్వార్టర్‌లో 5,762 మందికి టీసీఎస్ ఉద్యోగాలిచ్చింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో 11 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ప్లాన్ చేసినట్ట ట్రెయినీలను తీసుకుంటామని కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను క్యాంపస్ హైరింగ్ మొదలు పెడతామని పేర్కొన్నారు.