
- మొత్తం ఆదాయం రూ.64,479 కోట్లు
ముంబై: ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ (క్యూ4)లో 1.68 శాతం తగ్గి రూ.12,224 కోట్లకు చేరుకుంది. కంపెనీకి మొత్తం రూ.64,479 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 5.3 శాతం ఎక్కువ. మొత్తం 2024–25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం వార్షికంగా 5.76 శాతం పెరిగి రూ.48,553 కోట్లకు చేరుకుంది.
మొత్తం ఆదాయం 5.99 శాతం తగ్గి రూ.2,55,324 కోట్లకు చేరుకుంది. వార్షిక ఆదాయం 30 బిలియన్ డాలర్లు దాటినందుకు, వరుసగా రెండవ క్వార్టర్లో బలమైన ఆర్డర్ బుక్‌ను సాధించినందుకు సంతోషంగా ఉందని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అన్నారు. చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ, 2025 ఆర్థిక సంవత్సరంలో 42 వేల మంది ట్రెయినీలను తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా టీసీఎస్ బోర్డు కంపెనీకి ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 30 ఫైనల్ డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.
డొమైన్ల గ్రోత్ 22.5 శాతం...
నిలకడైన కరెన్సీల్లో వివిధ డొమైన్లు ఏడాది లెక్కన 22.5 శాతం వృద్ధి చెందాయి. ఎనర్జీ, వనరులు, యుటిలిటీలు 4.6 శాతం పెరిగాయి. బీఎఫ్ఎస్ఐ 2.5 శాతం, టెక్నాలజీ సర్వీసెస్ డొమైన్ 1.1 శాతం ఎగిసింది. కమ్యూనికేషన్, మీడియా విభాగాలు 9.8 శాతం తగ్గాయి. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ డొమైన్ 5.6 శాతం, తయారీ డొమైన్ 2.9 శాతం తగ్గాయి. ఉత్తర అమెరికా మినహా అన్ని విదేశీ మార్కెట్లు పెరిగాయి. లాభాలను సంపాదించాయి. ఇండియా మార్కెట్ ఏడాది లెక్కన 33 శాతం, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా 13.2 శాతం వృద్ధి చెందింది.
ఆసియా–పసిఫిక్ 6.4 శాతం, లాటిన్ అమెరికా 4.3 శాతం, యూరప్ 1.4 శాతం, యూకే 1.2 శాతం పెరిగాయి. ఉద్యోగుల సంఖ్య మార్చి 31 నాటికి 6,07,979గా ఉంది. వీరిలో 35.2 శాతం మహిళలు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆర్తి సుబ్రమణియన్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, - ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఆర్తి ఈ ఏడాది నుంచి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. ఈ నియామకం కంపెనీ వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మంగేష్ సాథేను చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు కూడా టీసీఎస్ ప్రకటించింది.
జీతాల పెంపు వాయిదా
స్థూల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, అమెరికా సుంకాల ఆందోళనల వల్ల టీసీఎస్ ఏప్రిల్‌లో జీతాల పెంపులను వాయిదా వేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అమెరికా విధించే సుంకాల వల్ల ఐటీ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, టీసీఎస్ ముందు జాగ్రత్త చర్యగా వేతన పెంపులను నిలిపివేసింది. ఈ పరిస్థితిని సమీక్షించిన తర్వాత, జీతాలు పెంచుతామని టీసీఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. ఈ ప్రకటన టీసీఎస్ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.