
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) నిర్వహించిన అండర్-17 వన్డే సిరీస్‌లో అమెరికా యూత్ క్రికెట్ అకాడమీ (ఏవైసీఏ) టీమ్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ఏవైసీఏ 57 రన్స్ తేడాతో టీడీసీఏ ఎలెవన్ ను ఓడించింది. తొలుత అమెరికా టీమ్ 49.1 ఓవర్లలో 297కు ఆలౌటైంది. ఛేజింగ్‌లో టీడీసీఏ 42.5 ఓవర్లలో 240 రన్స్ మాత్రమే చేసింది.
అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లను తెలంగాణ గ్రామీణ క్రికెటర్లతో ఆడేందుకు తీసుకొచ్చిన కొలిపాక అరుణ్‌కు టీడీసీఏ ప్రెసిడెంట్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిభావంతులైన తెలంగాణ గ్రామీణ క్రికెటర్లను టీమిండియాకు ఆడించడమే టీడీసీఏ లక్ష్యమన్నారు.