వీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి

వీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి

అమరావతి: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటేయడంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యింది. 

కాగా, కోరమ్ సరిపోవడంతో శనివారం (ఏప్రిల్ 19) జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్. సమావేశం ప్రారంభం కాగానే.. హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకుని ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఓటింగ్‌లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. మరోవైపు.. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. మేయర్ పీఠం దక్కడంతో.. కూటమి కార్పొరేటర్లు ఆదివారం (ఏప్రిల్ 20) మేయర్‎ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. 

కాగా, విశాఖ మేయర్ పీఠం కోసం అధికార కూటమి, వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. ఇరు వర్గాలు కార్పొరేటర్లను క్యాంపులకు తరలించాయి. పీఠాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని వైసీపీ చివరి వరకు విశ్వప్రయత్నం చేసింది. చివరకు కార్పొరేటర్లకు విప్ కూడా జారీ చేసింది. అయినప్పటికీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో విశాఖ మేయర్ సీటు కూటమి వశమైంది. 

విశాఖ మేయర్ పీఠం దక్కడంతో కూటమి సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారని అన్నారు. త్వరలోనే మంచి కూటమి నుంచి మంచి మేయర్ ను ఎన్నుకుంటామని తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. న్యాయం, ధర్మం గెలించిందని అన్నారు.