ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నిరాశ..!

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నిరాశ..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ ప్రకటించింది. మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. యాదవ సామాజిక వర్గం నుంచి బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గం నుంచి బీటీ నాయుడు,  ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి కావలి గ్రీష్మకు అవకాశం కల్పించింది తెలుగు దేశం పార్టీ. ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ.

2025, మార్చి 29తో  ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ల సమర్పణకు ఒక్క రోజు సమయం ఉన్న నేపథ్యంలో ఆదివారం (మార్చి 9) టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. సోమవారం టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

ALSO READ | వెలిగొండకు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తా: ఏపీ సీఎం చంద్రబాబు

ప్రస్తుత ఏపీ అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఐదు స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే దక్కనున్నాయి. కూటమి పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి చెరో ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది టీడీపీ. మిగిలిన మూడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేన ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ప్రకటించింది. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు జనసేన అవకాశం కల్పించింది.

 బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల దాఖలకు సోమవారమే చివరి తేదీ కావడంతో బీజేపీ క్యాండిడేట్ ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే, పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ హై కమాండ్ హామీ ఇచ్చింది. కానీ తాజాగా టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లలో వర్మ పేరు లేకపోవడం గమనార్హం. మరీ వర్మకు టీడీపీ ఏ పదవి ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.