ఏపీలో ఎన్నికల హడావిడి ముమ్మరమైన క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అసమ్మతి సెగ గట్టిగా తగిలింది. తూర్పు గోదావరి జిల్లా రామవరంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ టీడీపీ జెండాలు, పార్టీ గుర్తు సైకిల్ ను దగ్ధం చేశారు కార్యకర్తలు. అనపర్తి టికెట్ ను బీజేపీకి కేటాయించటంతో ఆ సీటు ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తనకు టికెట్ కేటాయించకపోవటంతో నల్లమిల్లి అనపర్తి నుండి రెబల్ గా పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన అనుచరులతో సమావేశమయ్యాక నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నాడు నల్లమిల్లి. ఈ క్రమంలో ఆయన అనుచరులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పార్టీ కరపత్రాలు, జెండాలు, సైకిల్ ను దగ్ధం చేసిన కార్యకర్తలు చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు మానుకోవాలని అన్నారు. టీడీపీ శ్రేణుల నిరసనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో సుదీర్ఘ కాలంగా తర్జనభర్జన పడిన తర్వాత బీజేపీ జాబితా ప్రకటించినా కూడా చంద్రబాబు నిరసన సెగ తప్పలేదు.