ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీల్లో బొత్స అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ జరపాలని అధికారులను ఆయన కోరారు. టీచర్ల బదిలీ కోసం ఒక్కో టీచర్ వద్ద రూ. 3 లక్షల నుంచి రూ.6 లక్షలు వసూలు చేశారని వర్ల రామయ్య తన ఫిర్యాదులో తెలిపారు. మొత్తంగా రూ.65 కోట్ల వసూళ్లకు బొత్స పాల్పడ్డారని ఆరోపించారు.
ఎన్నికల కోడ్ వచ్చాక కూడా టీచర్ల బదిలీలు చేశారని వర్ల రామయ్య ఆరోపించారు. బొత్స హయాంలోం జరిగినంత అవినీతి ఎప్పుడూ జరగలేదన్నారు. గత వైసీపీ పాలనలో పని చేసిన మంత్రుల్లో చాలామంది జైలుకి వెళ్తారంటూ ఆయన హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ నేతల అవినీతి భాగోతం అంతా బయటకు వస్తుందని తెలిపారు వర్ల రామయ్య.