పవన్ ఎఫెక్ట్: పిఠాపురం టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడన్న అంశంపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి బరిలో దిగనున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించాడు. పవన్ ప్రకటనతో జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకుంటుంటే టీడీపీలో మాత్రం అసమ్మతి సెగ రాజుకుంటోంది. టీడీపీ నేత సత్యనారాయణ వర్మను కాదని పవన్ కళ్యాణ్ అక్కడి నుండి పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు.

టీడీపీ ఫ్లెక్సీలకు, జెండాలకు నిప్పు పెట్టి తమ నిరసన తెలియజేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేసిన టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే నిరసన సెగ రాజుకోవటం చర్చనీయాంశం అయ్యింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి, పిఠాపురంలో రాజుకున్న అసమ్మతి సెగను చంద్రబాబు ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాలి.