
- కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర,బీటీ నాయుడుకు టికెట్లు
- జనసేన, బీజేపీకీ చెరో సీటు
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఏపీలోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది. కావలి గ్రీష్మ (ఎస్టీ), బీద రవి చంద్ర(బీసీ), బీటీ నాయుడు (బీసీ) పేర్లను ఆదివారం సాయంత్రం ఆ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో ముగ్గురి పేర్లను వెల్లడించింది.
మొత్తం ఐదు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా ఒక సీటు జనసేనకు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ పార్టీ నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. మరో టికెట్ బీజేపీకి ఇస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్ పేరు వినిపిస్తోంది.
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపీ పురందేశ్వరి ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం అభ్యర్థిని ప్రకటించనున్నట్టు సమాచారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ. బీద రవిచంద్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసి. బీటీ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు అయింది.