ఖమ్మం బరిలో టీడీపీ.?.. కమ్మ అభ్యర్థిని రంగంలోకి దించే చాన్స్

  • బలమైన అభ్యర్థి కోసం టీడీపీ వేట
  • బీజేపీ టికెట్ కోసం జలగం ప్రయత్నాలు 
  • అందుకోసమే పెండింగ్ లో పెట్టారా? 
  • మైనారిటీల ఓట్ల కోసం కమలం ప్లాన్!


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధినాయకత్వం ఖమ్మం, వరంగల్  ను పెండింగ్ లో పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చేరికతో వరంగల్ స్థానంపై క్లారిటీ వచ్చింది. ఆరూరి అక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన జలగం వెంకటరావు ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. తనకు టికెట్ కేటాయించాలని ముఖ్యనేతలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కమలం పార్టీ నాయకత్వం మాత్రం ఈ స్థానాన్ని పెండింగ్ లో పెట్టడం కొత్త చర్చకు దారి తీసింది. 

టీడీపీకి చాన్స్ ఇస్తారా..?

ఖమ్మంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ ఇప్పుడిప్పుడే  అక్కడ అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో కమలం గుర్తుపై అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా ఉపయోగం ఉండదని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం ఈ స్థానం నుంచి టీడీపీని బరిలోకి దింపుతారని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లతోపాటు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ ఓటు బ్యాంకు తదితర సమీకరణాల నేపథ్యంలో విజయం తథ్యమనే భావనతో బీజేపీ అధినాయకత్వం ఉన్నదని తెలుస్తోంది.

ఎవరున్నారు..?

ఖమ్మం పార్లమెంటరీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జోరుగా  సాగుతోంది. గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన నామా నాగేశ్వరరావు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ను కూడా కన్ ఫర్మ్ చేసింది. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు. వీళ్లు కాకుండా బలమైన నాయకుడు ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది. 

22 దాకా ఆగాల్సిందే!

ఖమ్మంలో బీజేపీ పోటీ చేస్తుందా..? టీడీపీ బరిలోకి దిగుతుందా..? అనేది ఈ నెల 22వ తేదీన తేలనుంది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర  నాయకుడొకరు ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, 22వ తేదీన ఖమ్మం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే ఈ నెల 22వ తేదీ వరకు ఆగాల్సిందే.

ALSO READ :- IPL 2024: మా బౌలర్లపై ఒక్క శాతం కూడా ఆ ప్రభావం ఉండదు: 20 కోట్ల వీరులపై ఆసీస్ దిగ్గజం