కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్ లో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఉదయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కా రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ చేయడానికి ప్రయత్నించారు. దీనిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. తిక్కారెడ్డిపై వైసీపీ నేత, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులు వేటకొడవళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. అప్పటికే పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు.
ఇంతలోనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి వచ్చి టీడీపీ జెండాను తొలగించి తిక్కా రెడ్డి పై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిక్కా రెడ్డి గన్ మెన్ 2 నుంచి 4 రౌండ్లు ఫైరింగ్ చేశారు. అదే సమయంలో తిక్కారెడ్డి ఎడమకాలుకు, మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిద్దరూ అక్కడే కిందపడిపోయారు. తిక్కారెడ్డి, ఏఎస్ఐ వేణుగోపాల్ లను పోలీసులు, సహాయకులు అక్కడినుంచి తరలించి.. ఆదోని హాస్పిటల్ లో చేర్పించారు.
గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.