చిట్​ ఫండ్​ కేసులో టీడీపీ ఎమ్మెల్యే భర్త, మామ అరెస్ట్​ 

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి అరెస్ట్ సంచలనంగా మారింది. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది. అదిరెడ్డి వాసుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించారు.2022 ఆగస్టులో చేసిన మోసాలపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులపై కేసు నమోదైంది.  చిట్​ ఫండ్​ చట్టంలోని నిబంధనలే ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. చిట్టి పాడుకున్న సొమ్ముకు .. వారికి ఇచ్చిన డబ్బుకు తేడాలు ఉన్నాయని గుర్తించారు.  బ్యాంక్​ చెక్కు చూపించి.. చిట్టీలు పాడుకున్న వ్యక్తికి మరో విధంగా డబ్బులు ఇచ్చారని బాధితులు ఫిర్యాదు చేశారు.

రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ఫండ్‌ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్‌ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్‌ మోసాలపై సీఐడీకి కాకినాడ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్‌ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్‌ డిక్లరేషన్‌ను అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించారు. 

49 సబ్‌స్కైబర్‌ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలిచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా చిట్‌ఫండ్‌ నిధులతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడంతో 1982 చిట్‌ ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లు ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అరెస్ట్‌ చేసింది. 2022 నవంబర్‌ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్‌ కంపెనీల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్‌ సహా రాష్ట్రంలో పలు చిట్‌ఫండ్‌ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు.