టీడీపీ ఎంపీ బంపరాఫర్ : మూడో బిడ్డకు 50 వేలు.. అబ్బాయి అయితే ఆవు, దూడ

టీడీపీ ఎంపీ బంపరాఫర్ : మూడో బిడ్డకు 50 వేలు.. అబ్బాయి అయితే ఆవు, దూడ

జనాభా పెరుగుదలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. డీలిమిటేషన్ ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో జనాభా పెరుగుదలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి ప్రముఖులు కూడా జనాభా పెరుగుదల అవసరమని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా..సీఎం చంద్రబాబు వ్యాఖ్యల స్పూర్తితో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సంచలన ప్రకటన చేశారు. ఎవరికైనా మూడో సారి ఆడ బిడ్డ జన్మిస్తే అమ్మాయి పేరిట రూ.50వేలు డిపాజిట్ చేస్తానని ప్రకటించారు ఎంపీ.

మూడోసారి ఆడబిడ్డ పుడితే రూ. 50వేలు, మగబిడ్డ అయితే ఆవు, దూడ బహుమతిగా ఇస్తానని ప్రకటించారు ఎంపీ అప్పలనాయుడు. జనాభా పెరుగుదల కోసం ఎక్కువమంది పిల్లలను కనాలంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల స్పూర్తితో ఎంపీ ఈమేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ప్రతి నెల వచ్చే రూ. 3లక్షల జీతంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు ఎంపీ అప్పలనాయుడు.

Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఈ కార్యక్రమాన్ని ఎంపీగా ఉన్నంతవరకే కాదని.. శాశ్వతంగా కొనసాగిస్తానని తెలిపారు ఎంపీ. తనకు ఆరుగురు అక్క, చెల్లెల్లు, ఒక కుమార్తె ఉన్నారని.. తమ కుటుంబంలో ఇంతమంది మహిళలు ఉండటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఎంపీ. తమ కుటుంబంలోని మహిళలు చూపిస్తున్న ప్రేమాభిమానాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఎంపీ అప్పలనాయుడు.

సైకిల్ మీద పార్లమెంట్ సమావేశాలకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించిన ఎంపీ అప్పలనాయుడు తాజా ప్రకటనతో మరోసారి వార్తల్లో నిలిచారు. మరి, విజయనగరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న ఎంపీ నిర్ణయం ఏమేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.