కేటీఆర్ కు టీడీపీ నాయకుల బహిరంగ లేఖ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు తరుఫున 2023, నవంబర్ 19వ తేదీ ఆదివారం మంత్రి కేటీఆర్ భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పలు సవాళ్లు విసురుతూ టీడీపీ నేతలు  బహిరంగ లేఖ విడుదల చేశారు. 

"గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ భద్రాచలం రామాలయ అభివృద్ధికి ఇస్తామన్న రూ.100 కోట్ల నిధులు ఇంతవరకు ఇవ్వలేదు, రామాలయం అభివృద్ధి జరగలేదు. 2022 వరదల సమయంలో ఇక్కడకు వచ్చిన కేసీఆర్ ప్రతి ఏటా వచ్చే వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం రూ.1000 కోట్లతో కరకట్ట నిర్మాణం చేపట్టి.. ఇక్కడి ఇండ్లు, పంట పొలాలు, కాలనీలను వరద ముంపుకు గురి కాకుండా కాపాడుతామని ఇచ్చిన హామీ అటకెక్కించారు. ప్రతి ఏటా రామాలయంలో జరిగే ముక్కోటి, శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉత్సవాలు నిర్వహించాలి.


ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను ఏపీ సీఎం, మీ మిత్రుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి తిరిగి తెలంగాణలో కలపాలి.రాష్టవ్యాప్తంగా 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తూ, భద్రాచలం మండలంలో ఉన్న రైతులకు మాత్రం ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. అది కూడా ఇక్కడ అమలు చేయాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడి ప్రజలకు చేసిన హామీలను నెరవేర్చలేదు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వస్తున్న కేటీఆర్.. ముందుగా కెసిఆర్ ఇచ్చిన హామీలను, నిధులను మంజూరు చేసి, రాముని సన్నిధిలో ప్రకటించాలి" అని లేఖలో డిమాండ్ చేశారు.