టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్.. ఏకంగా కోటి మంది కార్యకర్తలకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ అధిష్టానం. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ ఇన్సూరెన్స్ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులతో కలిసి ఎంఓయుపై సంతకం చేశారు మంత్రి నారా లోకేష్.
ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ( జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు ) కోటిమంది కార్యకర్తలకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం తొలివిడత కింద రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లభించనుంది.
ALSO READ | ఏపీకి గుడ్ న్యూస్ : అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకు వెయ్యి కోట్లు
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్. కార్యకర్తల సంక్షేమనిధి సారధిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు. కార్యకర్తల కోసం ఇప్పటి వరకూ రూ.138కోట్లు ఖర్చు చేశామని.. గత ప్రభుత్వ హయాంలో కేసుల్లో ఇరుక్కున్న కార్యకర్తల కోసం లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ తరపున అన్నిరకాలుగా అండగా ఉంటామని అన్నారు మంత్రి లోకేష్.