కడపలో టీడీపీ, వైసీపీ ఫైటింగ్: పదిమందికి గాయాలు

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం వనిపెంట గ్రామంలో నిన్న రాత్రి రెండు రాజకీయ వర్గాల మధ్య ఫైటింగ్ జరిగింది. ఈ ఘర్షణలో పదిమందికి రక్త గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది.

మైదుకూరు నియోజకవర్గం వనిపెంట గ్రామంలోని ఒడ్డెర కాలనీలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక టీడీపీ నాయకులు. ఐతే… టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తుండగా.. కొందరు వారిని అడ్డుకున్నారు. తమ కాలనీలోకి రావొద్దంటూ బైకులు అడ్డుపెట్టారు. తమను అడ్డుకోవద్దని టీడీపీ నాయకులు తోసుకురావడంతో… ఘర్షణ పెరిగింది. ఒకరినొకరు తన్నుకోవడంతో పదిమందికి గాయపడ్డారు. స్థానిక ప్రైవేటు హాస్పిటల్ లో వీరిని చేర్పించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బాధితులను పొద్దుటూరు ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయారు.

వైసీపీ నాయకులు శేషు, నాగ బ్రదర్స్, వారి అనుచరులు తమను అడ్డుకుని తమపై దాడిచేశారని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు మీడియాకు చెప్పారు. ఆడవారిపై దాడి చేశారని ఆరోపించారు.