ఆంధ్రా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్.. గ్రామ పంచాయతీ కార్యాలయం ఫొటోపై రచ్చరచ్చ..!

ఆంధ్రాలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరినా రాజకీయ వేడి మాత్రం ఇప్పటికీ చల్లారలేదు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ, టీడీపీ విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా.. ట్విటర్ లో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నేతలు ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం ఫొటోను వైరల్ చేశారు. ఆ ఫొటోపై వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. 

ఇంతకీ విషయం ఏంటంటే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలంలో ఇరుకుపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.  ఆ భవనానికి పసుపు రంగు వేసి ఉంది. ఎన్టీఆర్ భవన్, దరువూరి శ్రీనివాస రావు చౌదరి, సర్పంచ్ అని రాసి ఉంది.  గ్రామ పంచాయతీ కార్యాలయం అనే పేరే ఆ భవనంపై కనిపించకపోవడం, ఎన్టీఆర్ భవన్ అని ఆ భవనంపై ఉండటంతో వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు ఆ ఫొటోను తన ట్విటర్ లో  పోస్ట్ చేశారు. ‘‘ఇది టీడీపీ కార్యాలయం అనుకున్నారేమో! కాదు కాదు! సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం!’’ అని ఎద్దేవా చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

Also Read:-కాకుల్లా వేధింపులు.. నిచాతినీచంగా అవమానాలు.. బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య

వైసీపీ హయాంలో రంగులు వేయడాన్ని తప్పుబట్టిన టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీ కార్యాలయాలనే పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తుందని వైసీపీ మద్దతుదారులు ట్వీట్ చేశారు. ఆ భవనం ఒక దాత సాయంతో కట్టారని ఫొటో చూస్తే స్పష్టంగా తెలుస్తుందని, ప్రభుత్వ సొమ్ముతో కట్టి బ్లూ కలర్ వేయలేదని టీడీపీ మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ ఇదే భవనానికి సంబంధించిన పాత ఫొటోలను, జగన్ ప్రభుత్వ హయాంలో ఆ భవనం ఎలా ఉందనే ఫొటోలను కూడా పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఆ భవనానికి ఎలాంటి రంగులు వేయలేదని, టీడీపీ అధికారంలోకి రాగానే పసుపు రంగు వేసి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని టీడీపీ పార్టీ ఆఫీస్గా మార్చేసిందని  వైసీపీ అనుకూల సోషల్ మీడియా పేజ్లు కౌంటర్ ఇచ్చాయి. ఇలా ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం ఫొటో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ, టీడీపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు కారణమైంది.