
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబుల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ‘టీ సేఫ్’ యాప్ భరోసానిస్తున్నదని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయల్ అన్నారు. గమ్యస్థానాలకు చేరేంత వరకు మహిళల భద్రతను యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. టీ సేఫ్ యాప్ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అమీర్‌పేట్‌మెట్రో స్టేషన్ వద్ద బుధవారం సక్సెస్ మీట్‌నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సెక్యూరిటీ మేనేజర్ బాలకృష్ణ, ఉబెర్, సేఫ్‌గాడి ప్రతినిధులతో కలిసి క్యాబ్స్‌లో టీ సేఫ్ యాప్, క్యూ ఆర్ కోడ్స్ అనుసంధానం చేశారు.
ఈ సందర్భంగా శిఖాగోయల్ మాట్లాడుతూ..ఉబెర్ ఎస్‌ఓఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లొకేషన్లు, ప్రయాణించే వారి వివరాలు, అత్యవసర సమయంలో స్పందించేందుకు స్థానిక పోలీసులకు సమాచారం చేరుతున్నదని చెప్పారు. సేఫ్‌గాడి సర్వీస్ ద్వారా క్యూ ఆర్ కోడ్‌తో డ్రైవర్ వెరిఫికేషన్ సహా టీ సేఫ్ సర్వీసెస్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో ఓలా, ర్యాపిడో, మనయాత్ర, అబిబస్ సహా అన్ని ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలను టీ సేఫ్‌యాప్‌తో ఇంటిగ్రేట్ చేస్తామని శిఖాగోయల్ పేర్కొన్నారు.