
సోషల్ మీడియా చాలా మంది యువతకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. దాన్నే వ్యక్తిగత అభిరుచిగా మార్చుకుని విజయం సాధిస్తున్నారు చాలా మంది. ఈ కోవలోకే వస్తాడు రాజస్థాన్ రాష్ర్టం చురు కు చెందిన 22 ఏళ్ల యువకుడు హిమాన్షు. అతను సోషల్ మీడియా ద్వారా సంపాదించిన డబ్బుతో తండ్రికి సొంత మిల్లు ఏర్పాటు చేయించి స్ఫూర్తిగా నిలిచాడు.
మొబైల్ కోసం షరతు..
టీ అమ్మే వ్యక్తి కొడుక్కి స్మార్ట్ ఫోన్ అంటే ఓ కల. హిమాన్షు తాను 12వ తరగతిలో ఉన్నప్పుడు మంచి మార్కులు వస్తే ఫోన్ కొనిస్తానని తన తండ్రి మాట ఇచ్చాడు. అప్పుడే హిమాన్షు మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం తండ్రి అతనికి మొబైల్ కొనిచ్చాడు. అప్పటినుంచి హిమాన్షు సోషల్ మీడియాని లోతుగా అర్థం చేసుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు అకౌంట్లు..
ఇన్‌స్టాగ్రామ్‌లో డా.ఏపీజే అబ్దుల్ కలాం అభిమాని పేరు మీద అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో మోటివేషనల్ పోస్ట్‌లను షేర్ చేసేవాడు. మరో అకౌంట్ హెల్త్ నాలెడ్జ్ పేరిట ఉంది. మొదటి అకౌంట్‌కు 1.9 మిలియన్లు, రెండో అకౌంట్‌కి 8.5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ప్రమోషన్ల పేరిట అతనికి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఈ రెండు అకౌంట్ల నుంచి అతను నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి లక్షలు అర్జిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న హిమాన్షు తన తండ్రితో మిల్లు పెట్టించడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చిందని ఉప్పొంగిపోతున్నాడు.