టీ స్టాల్ నిర్వాహకుడి చోరీ స్కెచ్ ఇదీ..!

టీ స్టాల్ నిర్వాహకుడి చోరీ స్కెచ్ ఇదీ..!
  • 400 సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: బ్యాంకులో డబ్బులు డిపాజిట్​ చేసేందుకు వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి, రూ.2.13 లక్షలు కొట్టేసిన ఇద్దరితోపాటు ఈ చోరీకి ప్లాన్​ వేసిన మరో వ్యక్తిని బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సీఐ చిర్రా రామయ్య కలిసి సోమవారం వెల్లడించారు. 

ఉప్పల్ చిలుకానగర్​కు చెందిన బండారిపల్లి సాయిరామ్​(23),  మోరంషెట్టి శ్రీహరి(23), చావన్​ లోకేశ్​(18) స్నేహితులు.  వీరిలో శ్రీహరి, లోకేశ్ డెలివరీ బాయ్స్​గా పని చేస్తుండగా,  సాయిరామ్​ రసూల్​పురాలోని కుమార్ ​వేలు బ్రదర్స్ డిస్ట్రిబ్యూటరీ సెంటర్ ఎదురుగా టీ-స్టాల్​ నిర్వహిస్తున్నాడు. అయితే, కస్టమర్ల నుంచి వచ్చిన డబ్బులను ఈ డిస్ట్రిబ్యూటరీ నిర్వాహకులు ప్రతి రోజూ సికింద్రాబాద్​ఎంజీ రోడ్డులోని కాస్మో  బ్యాంకులో  జమ చేస్తుంటారు. ఈ విషయాన్ని సాయిరామ్ గమనించి, తన ఇద్దరు మిత్రులతో కలిసి డబ్బులు కొట్దేద్దామని ప్లాన్​ వేశాడు. 

ప్లాన్​లో భాగంగా ఈ నెల 26న బ్యాంక్​కు వెళ్తున్న వేలు బ్రదర్స్ ​డిస్ట్రిబ్యూటరీ సెంటర్ మేనేజర్​ను శ్రీహరి, లోకేశ్ ముఖాలకు మాస్క్​లు ధరించి, ​నంబర్ ప్లేట్ లేని  హోండా యాక్టివా పై వచ్చి అడ్డగించారు. అతని వద్ద ఉన్న రూ.2.13లక్షల బ్యాగును లాక్కొని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 ఆ మార్గంలోని దాదాపు 400ల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, చివరకు శ్రీహరి, లోకేశ్​ను వారి ఇండ్ల వద్ద సోమవారం అరెస్టు చేశారు. తదుపరి విచారణలో ఈ చోరీకి సూత్రదారి అయిన సాయిరామ్​ను అదుపులోకి తీసుకొని, రూ.2 లక్షలు,మూడు సెల్​ఫోన్లు, బైక్​ను  స్వాధీనం చేసుకున్నారు.