ప్రతి రోజు ఉదయం ఒక కప్పు టీ తాగితే తప్ప పనులు మొదలవ్వవు. ఉదయపు బద్దకాన్ని వదిలించుకోవాలంటే కప్పు టీ కడుపున పడాల్సిందే. టీ అంటే పాలు, చాయ్ పత్తీ, చక్కెర ఉంటే చాలు. కానీ, ఇప్పుడు పాలు అవసరం లేకుండానే చాయ్ రెడీ అవుతోంది. ఇలా చేసిన ఒక్కో టీది ఒక్కో ప్రత్యేకత. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
దాల్చిన చెక్క, అల్లం టీ
కావాల్సినవి..
దాల్చిన చెక్క: 2 అంగుళాలు
అల్లం తరుగు: అర టీ స్పూన్
బ్లాక్ టీ ఆకులు: ఒక స్పూన్
నిమ్మకాయ: 1/4 ముక్క
పుదీనా ఆకులు: ఐదు
తయారీ..
ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. దాల్చిన చెక్క పొడిని మరుగుతున్న నీళ్లలో వేసి ఇంకొంచెం సేపు మరిగించాలి. తర్వాత అల్లం తరుగు వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. చివరిగా టీ ఆకులు వేసి స్టౌ ఆపాలి. రెండు నిమిషాల తర్వాత కప్పులో టీ పోసుకుని నిమ్మకాయ రసం, పుదీన ఆకులతో గార్నిష్ చేస్తే చాలు.
మసాలా టీ
కావాల్సినవి..
పాలు : ఒక కప్పు
టీ పొడి : ఒక స్పూన్
అల్లం: అర అంగుళం
శొంటి: పావు అంగుళం
లవంగాలు: రెండు, పంచదార: తగినంత
తయారీ..
ముందుగా పాలు, నీళ్లు కలిపి బాగా మరిగించాలి. తర్వాత పైన చెప్పిన పదార్థాల పొడిని మరుగుతున్న నీళ్లలో వేయాలి. బాగా మరిగిన తర్వాత కప్పులో వడ పోసుకుంటే గరం.. గరం.. మసాల టీ రెడీ.
కోకో టీ..
చాక్లెట్ రుచి కావాలనుకునే వాళ్లు టీ మరిగేటప్పుడు కోకో పౌడర్ కలిపితే సరిపోతుంది.
పుదీనా టీ
కావాల్సినవి..
పుదీనా ఆకులు : పది
పాలు : ఒక కప్పు
యాలకులు: రెండు
తేనె: తగినంత
తయారీ..
పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. రెండు కప్పుల నీళ్లు మరిగించి.. అందులో పుదీనా ఆకులు వేసి మూత పెట్టాలి. తర్వాత కప్పు పాలు, యాలకులు వేసి రెండు నిమిషాల మరిగించి.. దించేయాలి. చివరగా తేనె కలుపుకుంటే పుదీనా టీ రెడీ. పాలు ఇష్టం లేని వాళ్లు.. ఈ టీలో పాలు వేయకుంటే సరిపోతుంది.
చామంతి టీ
కావాల్సినవి..
టీ పొడి: ఒక స్పూన్
చామంతి రేకులు: రెండు స్పూన్లు
నిమ్మరసం, తేనె: తగినంత
తయారీ..
నీళ్లలో టీ పొడి వేసి బాగా మరిగించాలి. అందులో తాజా చామంతి రేకులు వేసి ఇంకొంచెం సేపు మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడ కట్టి కొద్దిగా నిమ్మరసం, తేనెతో కలుపుకుంటే.. మంచి వాసనతో చామంతి టీ రెడీ.
అల్లం టీ..
కావాల్సినవి
టీ పొడి: ఒక స్పూన్, అల్లం : 1/2 అంగుళం
పంచదార లేదా తేనె: తగినంత
తయారీ
టీ పొడి నీళ్లలో బాగా మరిగించి.. అందులో అల్లం ముక్కలు వేయాలి. పది నిమిషాల తర్వాత అందులో పంచదార లేదా తేనె కలుపుకుని తాగొచ్చు..
గ్రీన్ టీ..
కావాల్సినవి
గ్రీన్ టీ ఆకులు: ఒక స్పూన్ తేనె: రెండు టేబుల్ స్పూన్లు తయారీ నీళ్లను ముందుగా మరగపెట్టాలి. అందులో గ్రీన్ టీ ఆకులు వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడ పోసుకుని తేనె కలుపుకుంటే గ్రీన్ టీ రెడీ. ఇందులో అల్లం ముక్క వేసుకుంటే మరింత రుచి వస్తుంది.
బాదం టీ..
కావాల్సినవి..
టీపొడి: రెండు స్పూన్లు,
పాలు : ఒక కప్పు
బాదం పప్పులు: ఐదు (సన్నగా తరగాలి)
నిమ్మరసం, పంచదార: తగినంత
తయారీ
ముందుగా నీళ్లను వేడి చేసుకుని అందులో సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి కొంచెం సేపు మరిగించాలి. తర్వాత టీ పొడి, పాలు పోసి మరో పది నిమిషాలు మరిగించాలి. అందులో పంచదార లేదా తేనె కలుపుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమంలో నిమ్మరసం కలుపుకుంటే అదనపు రుచి వస్తుంది.
లెమన్ టీ..
కావాల్సినవి..
టీ పొడి: ఒక స్పూన్
పంచదార లేదా తేనె: తగినంత
నిమ్మరసం: కొంచెం
తయారీ
టీ పొడి వేసి నీళ్లు బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. చిక్కని డికాషన్ తయారయ్యాక వడపోసి నిమ్మరసం కలుపుకోవాలి. కావాల్సినంత చక్కెర లేదా తేనె కలుపుకుంటే సరిపోతుంది.