మళ్లీ మన మూలాల్లోకి వెళ్లాలి

  • పిల్లలకు కష్టపడేతత్వం నేర్పండి: వెంకయ్య నాయుడు
  • శిల్పారామంలో లోక్ మంథన్ ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: భారతీయులందరూ తిరిగి తమ మూలాల్లోకి వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పదని, మనతో పాటు జంతు జాలాలను కూడా బతికించుకునే సంస్కృతి మనదని తెలిపారు. వలసవాద బుద్ధిని వదిలి, తిరిగి మన మూలాల్లోకి వెళ్లడమే ‘లోక్ మంథన్’ ఉద్దేశమని వివరించారు. మాతృభాషలోనే అందరూ మాట్లాడాలని, ఇంగ్లిష్​పై వ్యామోహం పనికి రాదన్నారు. హైదరాబాద్​లోని శిల్పారామంలో ‘లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 ఎగ్జిబిషన్’ ను వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పిల్లలకు కష్టపడేతత్వం నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. హిందూ సంప్రదాయానికి కుటుంబ వ్యవస్థే కీలకమన్నారు. చిన్నారులతో మతృభాషలోనే మాట్లాడాలని..ఇంగ్లిష్​తోపాటు మతృభాషను పూర్తిగా నేర్పించాలని కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా మాతృభాషలోనే చదువుకున్నారని గుర్తుచేశారు.

తాను కూడా వీధి బడిలో చదువుకున్నానని తెలిపారు. కాన్వెంట్ మొహమే చూడని మోదీ ఇప్పుడు ప్రధాని అయ్యారని వెంకయ్య నాయుడు  పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సమాజంలో వ్యాప్తి చెందుతున్న వికృతులకు సంస్కృతి, జీవన విధానం ధ్వంసం కావడమే మూల కారణమన్నారు. మనమందరమూ తిరిగి నైతిక విలువలను, సంస్కృతిని, సంప్రదాయాలను తిరిగి సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు.  తెలంగాణకు సుసంపన్న చరిత్ర, సంస్కృతి, కళలు, శిల్పసంపదలు ఉన్నాయన్నారు. 

శిల్పకళా వేదికలో మంథన్: కిషన్ రెడ్డి 

లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం  ప్రారంభిస్తారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాములో ఆర్ఎస్ఎస్​ చీఫ్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారని తెలిపారు. లోక్ మంథన్ లో దేశంలోని ప్రముఖ కళాకారులు, మేధావులు, ఆర్టిస్టులు, ఆలోచనాపరులు, పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొంటారని వివరించారు. ఎగ్జిబిషన్  కార్యక్రమం శిల్పారామంలో జరుగుతుందని, మంథన్ మాత్రం శిల్పకళా వేదికలో జరుగుతుందన్నారు. ఈ మంథన్ కార్యక్రమానికి 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షేకావత్ పాల్గొంటారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.