- ఫ్రెండ్‌కు ఎరేజర్ ఇచ్చినందుకే కొట్టాడంటున్న విద్యార్థి
- స్టడీ అవర్‌లో పరిగెత్తడం, తిట్టడంతో భయపెట్టాలని చూశానన్న టీచర్
- ఆర్ట్ టీచర్‌కు మెమో
కోరుట్ల, వెలుగు : కోరుట్లలోని ప్రభుత్వ మైనార్టీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఓ స్టూడెంట్‌ను ఆర్ట్ టీచర్ ఇష్టమున్నట్టు చితకబాదాడు. ఎరేజర్‌ను తోటి విద్యార్థికి ఇచ్చినందుకు తన వీపుపై, కడుపులో గుద్దాడని, పారిపోతుండగా కాళ్లు పట్టి గుంజాడని బాధిత స్టూడెంట్ ఆరోపించాడు. అయితే, తాను భయపెట్టాలని మాత్రమే చూశానని, కొట్టలేదని, కాళ్లు పట్టి గుంజానని టీచర్ చెబుతున్నాడు. ఈ ఘటనలో గాయపడిన స్టూడెంట్‌ను కోరుట్ల దవాఖానకు, అక్కడి నుంచి జగిత్యాల దవాఖానకు తరలించారు. బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనం ప్రకారం... కోరుట్లలోని మెమిన్‌పురాకు చెందిన సిరాజ్ అలీ చిన్న కొడుకు ముదస్సిర్ బన్న పట్టణ శివారులోని మైనార్టీ బాయ్స్ రెసిడెన్సియల్స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి స్టడీ అవర్‌లో అతడు తోటి స్టూడెంట్అడిగాడని తన వద్ద ఉన్న ఎరేజర్ ఇచ్చాడు.
దీంతో చదవకుండా టైం వేస్ట్ చేస్తున్నాడని ఆగ్రహించిన ఆర్ట్ టీచర్ చంద్రశేఖర్ స్టూడెంట్‌ను కొట్టాడు. వీపుపై, కడుపులో గుద్దాడు. కిందపడిపోగా కాలు పట్టి గుంజడంతో మోకాలి కింద బొక్క ఉబ్బింది. ఇది చూసిన అక్కడి స్టాఫ్ పిల్లాడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పేరెంట్స్‌కు సమాచారమిచ్చారు. డాక్టర్ల సలహా మేరకు జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి సిరాజ్ అలీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ హరీశ్‌కు ఫిర్యాదు చేశాడు. టీచర్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా..స్టడీ అవర్‌లో మదస్సిర్ రూమ్ లో కూర్చోకుండా తిరిగాడని, ప్రశ్నిస్తే తననే తిట్టాడన్నారు.
దీంతో అతడికి భయం ఉండాలని కొట్టబోతే పరిగెత్తాడన్నారు. కాళ్లు పట్టి లాగానని, కొట్టలేదన్నారు. అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో ఆక్సిజన్ పెట్టించి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లామన్నారు. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదని తెలిసిందని, అందుకే పడిపోయాడన్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ టీచర్‌కు మెమో ఇచ్చామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.