ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు, గ్రామస్తులు
భద్రాద్రి జిల్లా తోగ్గూడెంలో ఘటన
ములకలపల్లి, వెలుగు : ఓ టీచర్ విద్యార్థిని ఒంటిపై వాతలు వచ్చేలా కొట్టడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి అతడిని చితకబాదారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం పంచాయతీ పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన వెలకం నగేశ్, లక్ష్మి దంపతులకు కొడుకు తేజ ఉన్నాడు. ఇతడు స్థానిక గిరిజన ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం తేజ ఇంగ్లీష్ పాఠం అప్పజెప్పలేదని, రెగ్యులర్‌గా స్కూల్‌కు రావడం లేదని క్లాస్ టీచర్ శ్యామ్ నాయక్ విచక్షణా రహితంగా కర్రతో కొట్టాడు.
పక్కనే ఉన్న అంగన్వాడీ సిబ్బంది వెళ్లి ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో వారు స్టూడెంట్తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. వారు వచ్చి చూడగా తేజ ఒంటిపై వాతలు కనిపించాయి. దీంతో వారు గ్రామస్తులతో కలిసి శ్యామ్‌ను చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సాయికిషోర్‌రెడ్డి అక్కడకు వచ్చి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు నచ్చజెప్పారు. చివరకు టీచర్ శ్యామ్‌నాయక్ క్షమాపణలు చెప్పడమే కాకుండా పిల్లవాడికి ట్రీట్మెంట్ చేయిస్తానని హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంతో ఆందోళన విరమించారు.