
- తలను స్కానింగ్ తీయించగా కనిపించిన కొట్టిన దెబ్బ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం జెడ్పీ స్కూల్ లో ఘటన
గన్నేరువరం, వెలుగు: వాటర్ బాటిల్ దాచి పెట్టిండని విద్యార్థిని టీచర్ చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. గన్నేరువరం మండలం చాకలివానిపల్లెకు చెందిన విద్యార్థి ముద్రవేని అభిచరణ్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ లో టెన్త్ చదువుతున్నాడు. శనివారం ఉదయం స్కూల్ లో బ్రేక్ టైమ్ లో బాటిల్ దాచి పెట్టిండని అభిచరణ్ ను బయాలజీ టీచర్ నర్సయ్య జుట్టు పట్టుకొని తన చేతికి ఉన్న ఐరన్ కడెం తీసి విచక్షణ రహితంగా తలపై కొట్టాడు.
దీంతో విద్యార్థికి తలనొప్పిగా ఉండడంతో పేరెంట్స్ కు చెబుతానని సార్ ను వేడుకున్నా వినలేదు. ఇంటికి కూడా పంపించలేదు. సాయంత్రం 5 గంటలకు స్కూల్ వదిలిన తర్వాత అభిచరణ్ ఇంటికి వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుని ఏడుస్తుండగా తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. నర్సయ్య సార్ బాటిల్ దాచి పెట్టానని కడియంతో తలపై మూడుసార్లు బలంగా కొట్టాడని, దీంతో తల బాగా నొప్పిగా ఉందని ఏడుస్తూ చెప్పాడు.
వెంటనే విద్యార్థిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీయించగా.. తల వెనుక భాగంలో ఐరన్ కడెంతో కొట్టిన దెబ్బ కనిపించింది. దీంతో టీచర్ నర్సయ్యపై చర్యలు తీసుకోవాలని ఆదివారం గన్నేరువరం పోలీసులకు బాధిత స్టూడెంట్ తల్లిదండ్రులు కంప్లయింట్ చేశారు.