స్టూడెంట్స్ జీవితంలో పేరెంట్స్ తర్వాతి స్థానం గురువుదే. తల్లి జీవితాన్ని ప్రసాదిస్తే, తండ్రి ఆ జీవితంపై నమ్మకం పెంచుతాడు. గురువు చదువు చెప్పి భవిష్యత్‌ని తీర్చిదిద్దుతాడు. అందుకే స్టూడెంట్స్ తమ లైఫ్‌లో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన వ్యక్తి టీచర్. పుస్తకాల్లోని పాఠాలతోపాటు తాము అనుభవం ద్వారా పొందిన విషయాలను కూడా క్లాస్ రూమ్‌ల్లో నేర్పితే వాటిని పిల్లలు లైఫ్‌లాంగ్ మర్చిపోరు. స్టూడెంట్స్ పైన, తద్వారా సమాజం పైన తమదైన ముద్ర వేయగల గొప్ప అవకాశం టీచర్లకు మాత్రమే ఉంది.
ఒకప్పుడు టీచింగ్‌ని పవిత్రంగా భావించేవారు. నలుగురూ చూసి నేర్చుకోవాల్సిన వ్యక్తి అంటూ బడి పంతుల్ని ఆదర్శంగా చూపేవారు. పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే ‘రేపు మీ సార్‌కి చెబుతా ఉండు’ అంటూ తల్లిదండ్రులు హెచ్చరించి క్రమశిక్షణగా పెంచేవారు. ఇప్పుడు ఆ ‘బెదిరింపుల’ ప్లేస్‌లోకి హోం వర్క్ వచ్చి చేరింది. హోం వర్క్ చేయకపోతే టీచర్ ఏమైనా అంటారేమోననే భయంతో, బెంగతో స్టూడెంట్స్ వాళ్లంతటవాళ్లే పద్ధతిగా నడుచుకుంటున్నారు. బుద్ధిగా వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు.
దీన్నిబట్టి స్టూడెంట్స్ బిహేవియర్‌ను డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా ప్రభావితం చేస్తున్న వ్యక్తి టీచర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోం వర్క్ బాగా చేసినప్పుడు టీచర్ మెచ్చుకుంటే పిల్లలు తెగ సంబరపడిపోతారు. ‘గుడ్’, ‘వెరీ గుడ్’ వంటి రిమార్క్లకు వాళ్ల రియాక్షనే మారిపోతుంది. రేపు ఇంకా బాగా హోం వర్క్ చేయాలనే ఉత్సాహం వస్తుంది. క్లాస్‌లు పెరుగుతున్నకొద్దీ టీచర్లు స్టూడెంట్స్‌కి ఫ్రెండ్స్‌లా, ఫిలాసఫర్లా, గైడ్‌లా వ్యవహరించాలి. అలాంటి వారే పిల్లలతో ‘ది బెస్ట్’ అని, ‘ఆల్‌రౌండ్ మెంటార్’ అని అనిపించుకోగలరు.
రోజులు, ప్రభుత్వాలు మారుతుండటంతో చదువు రూటు మారి వ్యాపారమైంది. గవర్నమెంట్ టీచర్లకు అసలు డ్యూటీకి బదులు కొసరు పనులు పెరిగాయి. దీంతో వారికి.. పిల్లలకు చదువు చెప్పే టైం దొరకట్లేదు. ఫలితంగా వాళ్లు పాఠాలు నేర్చుకోవటంలో వెనకబడుతున్నారు. ఈ విషయం అనేక రిపోర్టుల్లో, స్టడీల్లో తేలింది. ఈ పరిస్థితిని మార్చటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించట్లేదు. బాధ్యత మాదికాదంటే మాది కాదంటూ సర్కార్లు, టీచర్లు ఒకరిపైఒకరు తోసేసుకుంటూ కాలం వెళ్లదీయటం సరికాదు.
ఈరోజుల్లో టీచింగ్ ఒక బతుకు దెరువులా మారిన మాట నిజం. ఒకప్పుడు బతకలేనోడు బడిపంతులనేవారు. ఇప్పుడు బతక నేర్చినవాడు బడి పంతులు అంటున్నారు. కారణం కొందరు టీచర్లు స్కూల్లో డ్యూటీలో ఉండే ఫోన్లో ఏవేవో వ్యాపారాలను చక్కబెడుతున్నారు. అలాంటి కొద్ది మంది వల్ల టీచింగ్ వృత్తికి చెడ్డ పేరు వస్తోంది. అయితే ఈ వృత్తిని మనసారా ప్రేమించేవారు ఈనాటికీ ఎంతో మంది ఉన్నారు. ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్–2019’పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
స్కూల్స్‌లోని పిల్లల్లో నేర్చుకునే తత్వాన్ని పెంచటానికి పాలకులు, టీచర్లు, సొసైటీ చిత్తశుద్ధితో కృషి చేయాలి. అ, ఆ లు; ఇ, ఈ లు.. ఒకట్లూ రెండ్లూ, ఏబీసీడీలు.. ఇలా మినిమం నాలెడ్జ్ ప్రతి స్టూడెంట్లోనూ డెవలప్ అయ్యేలా చూడాలి. ప్రతిఒక్కరికీ చూసి చదవటం, రాయటం వచ్చేలా తీర్చిదిద్దటం అవసరం. ఇలా చేయలేకపోతే విద్యా వ్యవస్థకే తలవంపులా మారుతుంది. భవిష్యత్ తరాలు క్షమించవు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా టీచింగ్ పద్ధతుల్లో, సిలబస్‌లో మార్పులు మంచిది కాదు.
విద్యా రంగానికి సర్కారు సరిపోను బడ్జెట్ ఇచ్చి, టీచర్ల సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలి. టీచర్లు యూనియన్ల వారీగా విడిపోకూడదు. అలాగే ఎప్పటికప్పుడు తమ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి. కామన్ స్కూల్ విధానం ద్వారా కొత్త పద్ధతుల్లో చదువు నేర్పటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే టీచర్స్ డేకి నిజమైన అర్థం, పరమార్థం.
– మేకిరి దామోదర్
(ఇవాళ టీచర్స్ డే)