పరీక్షలు బాగా రాయలేడని ఓ విద్యార్థిని టీచర్ చితకబాదింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. ఎల్బీ నగర్ లోని ఇండో అమెరికన్ స్కూల్ లో 3వ తరగతి చదువుతున్న మేకల పునీత్ ను పరీక్ష సరిగా రాయలేదడని సైన్స్ ఉపాధ్యాయురాలు.. కర్రతో వీపుపై కొట్టింది. విద్యార్థి వీపుపై వాతలు పడ్డాయి. ఈ విషయాన్ని పునీత్ తల్లిదండ్రులకు చెప్పాడు.
దీంతో పునీత్ కుటుంబ సభ్యులు, విద్యార్ధి సంఘాల నాయకులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో నెల రోజుల క్రితం ఆర్ఎఫ్ సిఎల్ లోని శ్రీ చైతన్య స్కూల్ లో ఏడోవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ చితకబాదటంతో ఆస్పత్రి పాలైయ్యాడు.
విద్యా, బుద్దులు నేర్పాల్సిన గురువులే ఇలా విచక్షణ కోల్పోయి ప్రవర్తించటం సరికాదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయని.. లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ.. చదువు సక్రమంగా నేర్పించకుండా.. విద్యార్థులను చితక బాదటం సరైంది కాదని విద్యార్థి సంఘా నాయకులు మండిపడుతున్నారు.