స్టూడెంట్లను బంధించి.. కట్టెలు విరిగేలా కొట్టిండు

  •    కరీంనగర్​లో సర్కారు టీచర్​అమానుషం
  •     సస్పెండ్ చేయాలని పేరెంట్స్ డిమాండ్
  •     స్కూల్ ఎదుట స్టూడెంట్స్​, యూనియన్ల ఆందోళన 
  •     ఏబీవీపీ నాయకులపై సీఐ, కార్పొరేటర్ ​భర్త దాడి 

కరీంనగర్ క్రైం/ కరీంనగర్ టౌన్, వెలుగు:  కరీంనగర్ కార్ఖానాగడ్డ సర్కారు హైస్కూల్​లో విచక్షణ కోల్పోయిన ఓ టీచర్​30 మంది స్టూడెంట్లను గదిలో బంధించి కట్టెలు విరిగేలా కొట్టాడు. దీంతో పేరెంట్స్, విద్యార్థి సంఘాల లీడర్లు ఆందోళనకు దిగారు. స్టూడెంట్ల కథనం ప్రకారం.. కార్ఖానగడ్డ గవర్నమెంట్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న 30 మంది స్టూడెంట్స్ సోమవారం క్లాసులో అల్లరి చేస్తున్నారని బయాలజీ టీచర్ తిరుపతి హెచ్చరించి పోయాడు. పక్క క్లాసుకు వెళ్లినా అల్లరి తగ్గకపోవడంతో క్లాస్ రూమ్ కు గొల్లెం పెట్టి 30 మందిని మూడు కర్రలు విరిగిపోయేలా కొట్టాడు. దీంతో విద్యార్థుల కాళ్లు, చేతులకు వాతలు వచ్చాయి. హెచ్ఎం స్వామికి విషయం తెలియడంతో వారి పేరెంట్స్​కు, బయటి వ్యక్తులకు చెప్పొద్దని రిక్వెస్ట్​ చేశాడు. కానీ, స్టూడెంట్స్​ఇంటికి వెళ్లిన తర్వాత పేరెంట్స్ కు చెప్పడంతో వారు స్కూల్ కు వచ్చారు. టీచర్ తిరుపతిని నిలదీశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ​కార్పొరేటర్ సరిత భర్త అశోక్, ఏబీవీపీ నాయకులు స్కూల్ కు చేరుకున్నారు. టీచర్ ను సస్పెండ్ చేయాలని స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. 


ఈ క్రమంలో  త్రీటౌన్ సీఐ శ్రీనివాస్, సిబ్బందితో అక్కడికి వచ్చి ఏబీవీపీ లీడర్లు మల్యాల రాకేశ్, విష్ణు, నక్కప్రమోద్ పై దాడి చేశారు. కార్పొరేటర్ భర్త అశోక్ కూడా వారిపై చేయిచేసుకున్నారు. దీంతో స్కూల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందరినీ చెదరగొట్టి పంపించగా విద్యార్థులతో కలిసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఏబీవీపీ లీడర్లు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా లోపలకు తీసుకెళ్లి తర్వాత వదిలిపెట్టారు. టీచర్​పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో 342, 324, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమతో దురుసుగా ప్రవర్తించిన సీఐని కూడా సస్పెండ్ చేసి,కార్పొరేటర్ భర్త అశోక్ పై చర్యలు తీసుకోవాలని టౌన్ ఏసీపీ నరేందర్ కు ఏబీవీపీ నాయకులు కంప్లయింట్​చేశారు.