ఏపీ విద్యాశాఖ వర్గాల్లో ప్రకంపనలు
కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగం కోసం తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన ఓ ప్రభుత్వ టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్వయంగా బామ్మర్ది ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం విద్యాశాఖ అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో మూడేళ్ల క్రితమే ఇదే ఆరోపణలపై ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందిన గోవిందరాజులు సొంత మేదరి కులానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీనిపై కొందరు అప్పట్లోనే ఫిర్యాదు చేయగా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ జరిపి వాస్తవాలుంటే చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మౌనవ్రతం పాటించడం వివాదం రేపుతోంది. గోవిందరాజులు బాధితులు సమాచార హక్కు చట్టంతో ధృవీకరించుకుని మరీ ఫిర్యాదు చేసినా జాప్యం చేయడం దుమారం రేపింది. గతంలో ఇంకొక టీచర్ శ్యాంబాబు కూడా తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ఇలాగే ఉద్యోగం సంపాదించాడు. బీటీఎఫ్ ఫిర్యాదుతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు సదరు శ్యాంబాబును సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది.
బీటీఎఫ్ ఫిర్యాదుతో అధికారుల్లో కదలిక.. విచారణ ప్రారంభం
తాజాగా మాజీ సైనికోద్యోగి అయిన బీటీఎఫ్ వ్యవస్థాపకుడు కె.సతీష్ కుమార్ గోవిందరాజులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సంపాదించి సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు అర్భన్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వెంకటేశ్వర నాయక్, ఎంఇఓ సుభాన్ విచారణ చేపట్టారు. మేదరి కులానికి చెందిన వ్యక్తేనని.. నిర్ధారణ అయింది. విచారణలో భాగంగా గోవిందరాజులు స్వయానా బావమరిది సహదేవుడు హాజరై తన బావగారైన గోవిందరాజులు మేదరి కులానికి చెందిన వాడేనని తెలియజేశాడు. తమది అదే కులం కావడంతో తన చెల్లెలి ని ఇచ్చి వివాహం చేశామని చెప్పారు. కానీ తన బావ కులం ఎరుకలి (ఎస్టీ) గా మార్చుకొని టీచర్ ఉద్యొగం పొందిన విషయం ఆలస్యంగా తెలిసిందన్నాడు.
స్వయంగా బావమరిది వాంగ్మూలం తీసుకున్న తర్వాతైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బీటీఎఫ్ అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. సహదేవుడి సోదరుడు అంబన్న.. వారి కుమారుడు కూడా తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందారని.. వారిపై కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజా ఆరోగ్య శాఖ, డోన్ మున్సిపాలిటీ శాఖల్లో పిర్యాదు చేశామన్నారు. వారిపై కూడా వెంటనే విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారుల ఉదాసీనత చూసి పాములపాడు, నందికొట్కూరు, ఆత్మకూరు, వెలుగోడు మండలాలలో దాదాపుగా 30 మంది కి పైగా తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపై కూడా కలెక్టర్ గారు దృష్టి సారించి విచారణ చేపట్టి దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కర్నూలు తాహశీల్దార్ కార్యాలయంలో విచారణకు ఆదేశించిన ఉత్తర్వుల కాపీ..
for more News….