- టీచర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆర్డర్స్
మంచిర్యాల, వెలుగు : స్టూడెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ టీచర్‌ను తల్లిదండ్రులు నడిరోడ్డుపై చెప్పులతో కొట్టారు. వివరాల్లోకి వెళ్తే... సత్యనారాయణ అనే వ్యక్తి మంచిర్యాల మార్కెట్ సమీపంలోని గర్ల్స్ హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు కొన్ని రోజులుగా బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మొబైల్‌లో స్టూడెంట్లు, మహిళా టీచర్ల ఫొటోలు తీస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్టూడెంట్లు, టీచర్లు హెడ్ మాస్టర్ పద్మావతికి ఫిర్యాదు చేయడంతో ఆమె డీఈవో దృష్టికి తీసుకెళ్లారు.
ఆరోపణలపై ఎంఈవో మాళవీదేవి మంగళవారం స్కూల్‌లో విచారణ చేపట్టి వివరాలను డీఈవోకు అందజేశారు. దీంతో సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ డీఈవో యాదయ్య ఆర్డర్స్ జారీ చేశారు. మరో వైపు విషయం తెలుసుకున్న స్టూడెంట్ల తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి సత్యనారాయణను నిలదీశారు. దీంతో ఆయన గోడ దూకి పారిపోతుండగా వెంబడించి మార్కెట్ రోడ్ సమీపంలో పట్టుకొని చెప్పులతో కొట్టారు.
అతడు క్షమించాలని వేడుకోవడంతో వదిలిపెట్టారు. ఈ విషయంపై డీఈవో యాదయ్యను వివరణ కోరగా సత్యనారాయణ స్టూడెంట్లు, టీచర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు నిరూపణ కావడంతో అతడిని సస్పెండ్ చేశామన్నారు.