- నిలదీసిన తల్లిదండ్రులు, పరార్ అయిన టీచర్
కరీంనగర్ క్రైం, వెలుగు : స్టూడెంట్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ టీచర్‌ను తల్లిదండ్రులు నిలదీయడంతో అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఆగ్రహానికి గురైన వారు స్కూల్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కరీంనగర్ పట్టణంలోని నారాయణ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ స్టూడెంట్లను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. టీచర్ చేష్టలకు విసిగిపోయిన ఓ బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు శుక్రవారం స్కూల్‌కు చేరుకొని టీచర్‌ను నిలదీశారు.
వారు మాట్లాడుతుండగానే ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్లిన శ్రీనివాస్ అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు స్కూల్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. టీచర్‌ను అదుపులోకి తీసుకొని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. కాగా బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు డీఈవోకు వినతిపత్రం అందజేశారు.