- టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
తుంగతుర్తి , వెలుగు : విద్యారంగం సమస్యలను పరిష్కరించాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో స్కావెంజర్లను నియమించి మౌలిక వసతులను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రీప్రైమరీ స్కూళ్లను ప్రైమరీ స్కూళ్లలోనే నిర్వహించాలని, గ్రామంలోని పిల్లలందరూ అందులో చదివేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, లేదంటే విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం లోపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ.. గురుకులాలకు సొంత భవనలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని
కాంట్రాక్టు ఉద్యోగులు, టీచర్లను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములు, కార్యదర్శి జి.నాగమణి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు వై.సైదులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రావు, యూటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యులు యాకయ్య, శ్రీనివాసరెడ్డి, అరుణ భారతి పాల్గొన్నారు.